Telugu Global
Andhra Pradesh

సీపీఎస్ రద్దుకి ఓకే.. కండిషన్స్ అప్ల‌య్‌

2004కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేసే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వశాఖలన్నీ 2004 సెప్టెంబరు 1వ తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ కోరింది.

సీపీఎస్ రద్దుకి ఓకే.. కండిషన్స్ అప్ల‌య్‌
X

సీపీఎస్ రద్దుకోసం పోరాటం చేస్తున్న ఏపీ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. ఇన్నాళ్లూ జీపీఎస్ అంటూ ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు ఓల్డ్ పింఛన్ విధానానికి సుముఖంగానే ఉన్నట్టు సిగ్నల్స్ ఇస్తోంది. సీపీఎస్ రద్దు విషయంలో మెత్తబడింది. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టింది. ఈ కండిషన్లు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కాదు కాబట్టి సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.

2004 కంటే ముందు బ్యాచ్ వరకు..

సీపీఎస్ రద్దు చేస్తే ఓల్డ్ పింఛన్ స్కీమ్ (ఓపీఎస్) ప్రకారం పదవీ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీలతోపాటే పింఛన్లు కూడా పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వానికి ఇది తలకు మించిన భారం. కానీ ఉద్యోగులకు మాత్రం భవిష్యత్తుపై భరోసా. అందుకే వారు కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ దశలో ప్రభుత్వమే వెనక్కు తగ్గినట్టు అనిపిస్తోంది. ఎన్నికలకు ముందు జగన్ స్పష్టంగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ ఒక్కటీ చేయలేకపోయారు. మిగతా పథకాలన్నీ అమలు చేసి, సీపీఎస్ విషయంలో వెనకడుగు వేస్తే ఉద్యోగ వర్గాల్లో వైసీపీ పలుచన అయ్యే అవకాశముంది. అందుకే మధ్యే మార్గంగా జీపీఎస్ తెచ్చారు కానీ అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సీపీఎస్ రద్దుకి సిద్ధపడుతూనే 2004కంటే ముందు ఉద్యోగంలో చేరినవారికే ఓపీఎస్ అమలు చేస్తామంటూ మెలిక పెడుతున్నారు.

2004కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేసే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వశాఖలన్నీ 2004 సెప్టెంబరు 1వ తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ కోరింది. ఈనెల 14న సచివాలయంలో దీనికి సంబంధించిన వివరాలతో సమావేశానికి హాజరు కావాల్సిందిగా హెచ్‌ఓడీ కార్యాలయాలకు, ఆయాశాఖల కార్యదర్శులకు లేఖలు రాసింది.

పాఠశాల విద్యాశాఖలో 2004 సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందుగా చేరిన ఉద్యోగుల సంఖ్య 6,510. హోంశాఖతో పాటు ఇతర విభాగాల్లో ఈ లెక్క తీస్తున్నారు. దీని ద్వారా ద్వారా 2003 డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్‌-2 బ్యాచ్‌ ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. సీపీఎస్ రద్దు పోరాటంలో చురుగ్గా ఉన్నవారంతా 2004ముందు రిక్రూట్ అయినవారే కాబట్టి.. వారి ఆవేశం చల్లారుతుంది. కొత్తవారు తమ రిక్రూట్ మెంట్ సమయంలోనే సీపీఎస్ కి సిద్ధపడి చేరారు కాబట్టి వారినుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. దాదాపుగా ఈ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. మరీ పట్టుబడితే.. ఇంకొంత వెసులుబాటు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సో సీపీఎస్ కథ ఇక్కడితో ముగిసిపోతుంది, ఎన్నికల హామీలు నూటికి నూరు శాతం అమలు చేశామనే పేరుతో 2024లో వైసీపీ కాన్ఫిడెంట్ గా బరిలో దిగుతుంది.

First Published:  14 Sept 2022 7:16 AM IST
Next Story