Telugu Global
Andhra Pradesh

వ‌ర‌ద స‌హాయం కోసం ఏపీ స‌ర్కారు నిధులు విడుద‌ల‌

వరద బాధితులను పున‌రావాస కేంద్రాల‌కు తరలించేందుకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

వ‌ర‌ద స‌హాయం కోసం ఏపీ స‌ర్కారు నిధులు విడుద‌ల‌
X

గోదావ‌రి వ‌ర‌ద ఉప్పొంగుతుండ‌టంతో ముంపు ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్య‌ల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేస్తూ గురువారం ఉత్త‌ర్వులు ఇచ్చింది. గోదావ‌రి వ‌ర‌ద‌ల ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు, ప‌శ్చిమ గోదావ‌రి, అల్లూరి జిల్లా, తూర్పు గోదావ‌రి, కోన‌సీమ జిల్లాల‌పై త‌క్ష‌ణ ప్ర‌భావం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు త‌క్ష‌ణం ఈ నిధులు ఉప‌యోగించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అల్లూరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు రూ. 3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ. 2 కోట్లు, తూర్పు గోదావరికి రూ.1 కోటి చొప్పున ప్ర‌భుత్వం నిధులు కేటాయించింది. వ‌ర‌ద ప్ర‌భావంతో ముంపు బారిన ప‌డిన గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు, పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించేందుకు, తాగునీరు, ఆహారం, పాల పంపిణీ, వైద్య శిబిరాల ఏర్పాటు, శానిటేష‌న్ వంటి వాటి నిమిత్తం ఈ నిధులు ఉప‌యోగించాల‌ని ప్ర‌భుత్వం ఆ ఆదేశాల్లో పేర్కొంది.

వరద బాధితులను పున‌రావాస కేంద్రాల‌కు తరలించేందుకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలకు మున్సిపల్, పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖల సేవలు వినియోగించుకుని ఖర్చు తగ్గించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

First Published:  28 July 2023 7:27 AM IST
Next Story