పోలవరం వద్ద హై అలర్ట్
పోలవరం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులను దాటేసింది.
మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఒడిశాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం వద్ద ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
భారీగా వరద వస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 66.3 అడుగులకు చేరింది. ఇది 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. 36 ఏళ్ల తర్వాత గోదావరి వంతెన పై రాకపోకలు నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఏపీ, ఛత్తీస్‌గడ్, ఒడిశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం గోదావరి వంతెన వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.
పోలవరం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులను దాటేసింది. అవసరమైతే అప్పటికప్పుడు ఎగువ కాపర్ డ్యాంకు మరమ్మతులు చేసేందుకు వీలుగా సామగ్రిని, యంత్ర పరికరాలను సిద్ధం చేసుకుంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 66 అడుగులు దాటిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద 25 నుంచి 28 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణాహిత నుంచి కూడా ఇంకా భారీగానే వరద వస్తోంది. పోలవరం వద్ద ప్రవాహం 30 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, అందుకే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 25 లక్షల 50 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే స్థాయిలో ఎగువ కాపర్ డ్యాం నిర్మించారు. అయితే ప్రస్తుతం అంతకుమించి ప్రవాహం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం పోలవరం వద్ద నీటిమట్టం 36 మీటర్లుగా ఉంది. ఎగువ కాపర్ డ్యాం ఎత్తు 43 మీటర్లు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి, కాపర్ డ్యాం ఎత్తుకు మధ్య 7 మీటర్లు మాత్రమే ఇక తేడా ఉంది. మరో ఐదు మీటర్ల మేర నీటి ప్రవాహం పెరిగితే ఎగువ కాపర్ డ్యాంపై ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
25 నుంచి 30 లక్షల క్యూసెక్కుల మధ్య ప్రవాహం వస్తే ఎగువ కాపర్ డ్యాం పైనుంచి నీరు ప్రవహిస్తుందన్న అనుమానాల్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రాత్రి వేళల్లో కూడా పర్యవేక్షించేందుకు వీలుగా ప్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. పోలవరం డ్యాం మొత్తం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు వద్ద ఎగువ కాపర్ డ్యామును కాపాడుకునేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జూలై రెండవ వారంలోనే ఈ స్థాయిలో వరద రావడం అనేది అనూహ్యమన్నారు. పోలవరం వద్ద ప్రస్తుతం 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని ఎగువ నుంచి వస్తున్న వరదలు గమనిస్తుంటే ఆ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి గురువారం వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని, అక్కడ సరైన సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.