రబీలో ఆరు తడి పంటల వైపు... ఏపీ సర్కారు చూపు - వరి సాగులో నష్టాల నివారణే లక్ష్యం
ఈ ఏడాది రబీలో ప్రయోగాత్మకంగా ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ ఏడాది రబీ వరి సాగు స్థానంలో బోర్ల కింద ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటల సాగును ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్‌లో బోర్ల కింద వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకు ఖర్చు కూడా ఎక్కువే. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి, గిట్టుబాటు ధర దక్కక రైతులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వరి స్థానంలో అపరాలు, చిరు ధాన్యాల సాగుకు వారిని ప్రోత్సహిస్తోంది.
ఏపీలో రబీ సాగు సాధారణ విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. గతేడాది ఏకంగా 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. అందులో వరి సాగు 19.72 లక్షల ఎకరాల్లో చేపట్టారు. అపరాలు 24 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4.97 లక్షల ఎకరాలు, నూనె గింజలు 3.47 లక్షల ఎకరాల్లో, చిరు ధాన్యాలు 3.2 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెంచి 58.68 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రత్యేక కార్యాచరణ...
ఈ ఏడాది రబీలో ప్రయోగాత్మకంగా ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది రైతులు సంప్రదాయ వరి సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తాజా నిర్ణయంతో బోర్ల కింద ప్రయోగాత్మకంగా 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఆయా రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, యంత్ర పరికరాలను 50 శాతం రాయితీ కింద అందించనున్నారు. అలాగే మిషన్ మిల్లెట్ ప్రాజెక్టు కింద బోర్ల కింద పొలాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ కలిపి 50 వేల ఎకరాల్లో రాగి, కొర్రల పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ కార్యాచరణ ద్వారా వచ్చే ఫలితాలను బట్టి వచ్చే మూడేళ్లలో మూడు లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాలనేది అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.