'కల్యాణమస్తు'కు టెన్త్ క్లాస్ నిబంధనపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
కల్యాణమస్తు పథకానికి అర్హత ఉండాలంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ 10వ తరగతి పాసై ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ నిబంధనపై పలు విమర్శలు రావడంతో సీఎంవో క్లారిటీ ఇచ్చింది.

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందేలా చూస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఏదో రూపంలో సాయం చేయడానికి నవరత్నాలే కాకుండా పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు వీలుగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.
కల్యాణమస్తు పథకం ప్రవేశపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. కానీ పథకానికి పెట్టిన ఓ కండిషన్‌పై విమర్శలు వస్తున్నాయి. కల్యాణమస్తు పథకానికి అర్హత ఉండాలంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ 10వ తరగతి పాసై ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ నిబంధనపై పలు విమర్శలు రావడంతో సీఎంవో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో బాల్య వివాహాలను కట్టడి చేయడానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఎంతగానో కృషి చేస్తోంది. కానీ, అప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ 10వ తరగతి కూడా పూర్తికాకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తున్నారు. ఇలాంటి వివాహాలను కట్టడి చేయడానికే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టం చేశారు.
వరుడు, వధువు ఇద్దరూ పదో తరగతి పాసైతేనే కల్యాణమస్తు, షాదీ తోఫాకు అర్హత సాధిస్తారని మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణకు కల్యాణమస్తు పథకాన్ని ఉపయోగించుకుంటామని సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అన్ని అర్హతలు ఉన్న వారికే అమలు చేయాలని, లేకపోతే ఆ నిబంధన పెట్టిన అసలు లక్ష్యం నెరవేరదని ఆయన అధికారులకు చెప్పారు.
ఇక వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రూ. 1 లక్ష, ఈ కులాల్లో ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే రూ. 1.20 లక్షలు, బీసీలకు రూ. 50వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75వేలు అందుతాయి. మైనార్టీలకు రూ. 1 లక్ష, భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలో అయితే రూ. 40వేలు ఇవ్వాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.