హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆరు నెలల్లో అమరావతిలో అన్ని సదుపాయాలు కల్పించాలనే తీర్పు ఆచరణ సాధ్యం కాదని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీ రాజధాని అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. మూడు రాజధానుల కోసం చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. 3నెలల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వడంతో పాటు.. ఆరునెలల్లో అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని తీర్పు చెప్పింది.
ఈ తీర్పుపై తొలిరోజుల్లోనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆరు నెలల్లో అమరావతిలో అన్ని సదుపాయాలు కల్పించాలనే తీర్పు ఆచరణ సాధ్యం కాదని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
రాజధానిగా అమరావతే ఉండాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజధానిగా అమరావతే ఉండాలని చెప్పడం, రాజధానిపై చట్టం చేసే అధికారాలు రాష్ట్ర శాసనసభకు లేవంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో వివరించింది. శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పుఉందని అభ్యంతరం తెలిపింది.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని.. దాన్ని హైకోర్టు ప్రశ్నించజాలదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో వాదిస్తోంది. సీఆర్‌డీఏ చట్టాన్ని అనుసరించి అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ది చేయాలని కూడా హైకోర్టు చెప్పిందని.. ఆరు నెలల్లో అభివృద్ధి ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి హైకోర్టు తీర్పును రద్దు చేయాలని తన పిటిషన్‌లో సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.