Telugu Global
Andhra Pradesh

వాలంటీర్‌గా వచ్చారు.. వెళ్లిపోతున్నారు. పాత నీరు పోతే కొత్త నీరు.. అంతే- సజ్జల

కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి వారంతా ఆ రోజుల్లో వాలంటీర్‌గా వచ్చి పనిచేశారని.. ఇప్పుడు నచ్చకుంటే వెళ్లిపోతారని.. పాత నీరు పోతే, కొత్త నీరు వస్తుందన్నారు.

వాలంటీర్‌గా వచ్చారు.. వెళ్లిపోతున్నారు. పాత నీరు పోతే కొత్త నీరు.. అంతే- సజ్జల
X

ఎవరో ఒకరిద్దరిలో తప్పించి వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్‌పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలాంటి వారు ముందే బయటపడితే తమకూ మంచిదేనన్నారు. అక్కడ మరొకరిని సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

కోటంరెడ్డి ఆరోపణలపై విచారణ చేయించాల్సిన అవసరమే లేదన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని జ‌గ‌న్ నడపడం లేదని.. పూర్తిగా ప్రజల మీద ఆధారపడే రాజకీయం చేస్తున్నారని సజ్జల చెప్పారు. బయటకు వచ్చిన ఆడియోను ఒక శ్రేయోభిలాషిలాగే కోటంరెడ్డికి సీతారామాంజనేయులు పంపి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి వారంతా ఆ రోజుల్లో వాలంటీర్‌గా వచ్చి పనిచేశారని.. ఇప్పుడు నచ్చకుంటే వెళ్లిపోతారని.. పాత నీరు పోతే, కొత్త నీరు వస్తుందన్నారు. ఉద్దేశాలు వేరుగా ఉన్నప్పుడు.. బుజ్జగించినా నిలబడే పరిస్థితులు ఉండవన్నారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు జగన్‌ ఇంట్లో పనిచేసే నవీన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్‌ చేయడంలో త‌ప్పేముంద‌ని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు చేసినా ఆ ఫోన్ ఎవరిది అన్నది తేలేదన్నారు. అది చాలా చిన్న విషయమని చెప్పారు.

సొంత చిన్నాన్న చనిపోతే ఆ విషయాన్ని తెలియజేసేందుకు ఫోన్‌ చేయకుండా ఎలా ఉంటారని సజ్జల ప్రశ్నించారు. విశాఖపట్నానికి వెళ్తామని జగన్ చెప్పడం కోర్టు ధిక్కరణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో వెళ్తామని చెప్పారని.. కోర్టు వివాదాలు అన్ని దాటుకున్న తర్వాతే అక్కడికి వెళ్తామన్నది ఆయన ఉద్దేశమని వివరించారు. అందుకే జగన్‌ పలాన రోజు వెళ్తామని చెప్పలేదన్నారు.

పెట్టుబడుల సదస్సులో ఒక మాటగా విశాఖకు వెళ్తామని జగన్‌ చెప్పారని.. దీన్ని పట్టుకుని ఎందుకు హడావుడి చేస్తున్నారని మీడియాను ప్రశ్నించారు. హడావుడి చేస్తున్న మీడియానే తిరిగి వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే మూడు రాజధానులు అంటున్నారని ప్రచారం చేస్తోందని సజ్జల విమర్శించారు.

First Published:  1 Feb 2023 12:40 PM IST
Next Story