Telugu Global
Andhra Pradesh

ఆంధ్రజ్యోతిది తప్పుడు కథనం - అజయ్ కల్లాంవివరణ

తనకు తెలిసిన సమాచారాన్ని ఎస్పీకి చెప్పానన్నారు. ఆ రోజు మేనిఫెస్టోపై చర్చించేందుకు సమావేశం జరిగిందని.. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత జగన్‌మోహన్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి నో మోర్ అని చెప్పారని అజయ్ కల్లాం వివరించారు.

ఆంధ్రజ్యోతిది తప్పుడు కథనం - అజయ్ కల్లాంవివరణ
X

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాను సీబీఐకి చెప్పిన విషయాలంటూ ఆంధ్రజ్యోతి తప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించింద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తూ ఆయ‌న‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సర్‌ మీరు ఇష్టపడితే కొద్దిసేపు చిట్‌చాట్‌ తరహాలో మాట్లాడుతా అని ఆయన విజ్ఞప్తి చేశారని అజయ్ కల్లాం చెప్పారు. అంతకు మించి తన స్టేట్‌మెంట్‌ను రికార్డు కూడా చేయలేదన్నారు. ఎలాంటి సంతకాలు తీసుకోలేదన్నారు. తన నుంచి ఏదైనా కొత్త సమాచారం అందుతుందేమోనన్న ఉద్దేశంతోనే సీబీఐ ఎస్పీ వచ్చారన్నారు.

తనకు తెలిసిన సమాచారాన్ని ఎస్పీకి చెప్పానన్నారు. ఆ రోజు మేనిఫెస్టోపై చర్చించేందుకు సమావేశం జరిగిందని.. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత జగన్‌మోహన్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి నో మోర్ అని చెప్పారని అజయ్ కల్లాం వివరించారు. దాంతో తాము సమావేశాన్ని మధ్యలోనే ఆపేసి వచ్చేశామన్నారు. అంతే జరిగిందని.. అక్కడ గుండెపోటా..? ఎలా చనిపోయారు..? అన్న చర్చే రాలేదన్నారు. సీబీఐ ఎస్పీ కూడా ఆ విషయాన్ని అడగలేదన్నారు. కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని జగనే చెప్పినట్టు తాను సీబీఐకి వివరించానంటూ తప్పుడు కథనం రాసిందని అజయ్ కల్లాం మండిప‌డ్డారు.

తన దగ్గర సీబీఐ సమాచారం తీసుకుంది అన్న వరకు రాసి ఉంటే అభ్యంతరం లేదని, అసలు తాను చెప్పని విషయాలు చెప్పినట్టు తప్పుడు వార్తలు రాశారన్నారు. విశ్వసనీయ సమాచారం అని ఆ పత్రిక రాసిందని.. అలాంటప్పుడు ఆ సమాచారం అంది ఉంటే తన నుంచి గానీ, సీబీఐ నుంచి గానీ అంది ఉండాలని.. కాబట్టి సీబీఐ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వార్తను ఖండించాలని కోరారు. అసలు ఆ రోజు ఎన్ని గంటలకు జగన్‌ మోహన్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారన్నది ఎలా గుర్తుంటుందని అజయ్ కల్లాం ప్రశ్నించారు. ఎన్ని గంటలకు చెప్పారు అని తాముఏమైనా సమయం రికార్డు చేసుకుంటామా అని ప్రశ్నించారు.

First Published:  18 May 2023 1:49 PM IST
Next Story