గంటా వర్సెస్ గుడివాడ: పెట్టుబడుల సదస్సుపై పేలుతున్న జోకులు
విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న పెట్టుబడుల సదస్సుపై సోషల్ మీడియాలో టీడీపీ జోకులు పేలుస్తోంది.
విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న పెట్టుబడుల సదస్సుపై సోషల్ మీడియాలో టీడీపీ జోకులు పేలుస్తోంది. చాన్నాళ్లుగా పార్టీ వ్యవహారాల్లో స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఈ సదస్సుపై సెటైర్లు వేస్తూ సీఎం జగన్ కి ఓ లేఖ రాశారు. 20 అంశాలపై సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏమొహం పెట్టుకుని పారిశ్రామిక వేత్తలను ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు అడుగుతుందన్నారు గంటా. జాకీ, లులూ, అమర్ రాజాని తరిమేశామని చెబుతారా..? అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తారా? అన్నారు. రాజధానే లేనప్పుడు పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు.
ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అన్నారు. అదానీ డేటా సెంటర్ కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇంత వరకు ఎందుకు పనులు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. వారికి ఇంకా భూములు కేటాయించడం ఎందుకని నిలదీశారు. దావోస్ సదస్సుకు ఏపీ ప్రభుత్వం వెళ్లకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలన్నారు.
ప్రపంచ పెట్టుబడుల సమావేశానికి ముందు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు. pic.twitter.com/6V27SIwuYs
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 2, 2023
టీడీపీ హయాంలో విశాఖలో 50వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు రెండు మూడు వేల మంది కూడా లేరన్నారు. ఐటీ కంపెనీలను ఎందుకు తరిమేశారని, హెచ్.ఎస్.బి.సి. వెళ్లిపోకుండా ఎందుకు ఆపలేకపోయారన్నారు. నాలుగేళ్ల వరకూ పట్టించుకోకుండా.. ఎన్నికలకు ఏడాది ముందు పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో వేసిన ప్రశ్నలు కాదని ఏపీలో సగటు పౌరుడుకి ఉన్న సందేహాలని గంటా స్పష్టం చేశారు.
మంత్రి గుడివాడ కౌంటర్లు..
గంటా శ్రీనివాసరావు లేఖపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. దావోస్ వెళ్లి టీడీపీ నేతలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు రాసిన లేఖపై గంటా సంతకం పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కడుపు మంటతో గంటా లేఖ రాశారన్నారు.