ఏపీ బడ్జెట్ అప్పుడే కాదు.. 3 నెలలు ఆగాల్సిందే
ఈనెల 22 ఉదయం 10గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడతారు.
ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో సరిపెడతాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పూర్తి స్థాయి బడ్జెట్ ను తెరపైకి తెస్తాయి. కానీ ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పుడల్లా కొత్త బడ్జెట్ ని తీసుకొచ్చేలా లేదు. మరో మూడు నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోనే సరిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 22నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాబోయే మూడు నెలలకోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని తెలుస్తోంది.
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ లెక్కలింకా తేలలేదని పూర్తి స్థాయి బడ్జెట్ ని వాయిదా వేస్తున్నారు. మరో మూడు నెలలకోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారని కూటమి వర్గాల సమాచారం. అక్టోబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారని అంటున్నారు. ఈనెల 22న ఉదయం 10గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడతారు.
సభలో శ్వేతపత్రాలు..
గత ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పులపై ఇటీవల వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలు బయటపెట్టారు. ఇటీవల శాంతి భద్రతలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ వాయిదా పడింది. దాంతోపాటు మద్యం పాలసీ, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలోనే ప్రవేశ పెట్టబోతున్నారు. ఇక సభలో తొలిరోజే నిరసన తెలిపేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. రెండో రోజు నుంచి వైసీపీ సభ్యులు ఉభయ సభలకు గైర్హాజరవుతారు. వారంతా ఢిల్లీలో తలపెట్టబోతున్న మహా ధర్నాకు హాజరవుతారు.