Telugu Global
Andhra Pradesh

గ్రామ సచివాలయాల్లో నష్టపోయిన రైతుల జాబితా ప్రదర్శన

త్వరగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి, నివేదిక ఖరారు చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తిచేయాలన్నారు.

గ్రామ సచివాలయాల్లో నష్టపోయిన రైతుల జాబితా ప్రదర్శన
X

ఏపీలో పంట నష్టం, రైతుల కష్టంపై సీఎం జగన్ స్పందించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సమీక్ష నిర్వహించిన జగన్, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను ఆదుకోడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు.

పంటనష్టం లెక్కింపు..

మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు సంబంధించి పంట నష్టం అంచనా తయారు చేశామని అధికారులు జగన్ కి తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంబంధించి నష్టం అంచనాలపై ఎన్యుమరేషన్‌ చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. త్వరగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి, నివేదిక ఖరారు చేయాలని అధికారులకు సూచించారు జగన్. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తిచేయాలన్నారు. ఈనెలలో రైతు భరోసా జమ చేయాలని, వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌ పుట్‌ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటే పరిస్థితి..

అకాల వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు నష్టపోయారు. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం అంచనా చురుగ్గా సాగుతోంది. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటు ఏపీలో కూడా పంట నష్టం అంచనాలు వెంటనే తయారు చేయాలని, రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగళ్ళ వానలతో తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఇప్పుడు ప్రభుత్వ సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు.

First Published:  3 May 2023 8:11 AM IST
Next Story