జగన్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంపై ప్రపంచ బ్యాంక్, ఆర్టీఐ ప్రశంసలు
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత ప్రాథమిక, గ్రామ స్థాయి కేంద్రాల్లో అప్పటి కన్నా ఎక్కువగా వైద్య పరీక్షలు జరిగినట్లు తాము గుర్తించామని వారు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై ప్రపంచ బ్యాంక్ గ్రూప్, రీసెర్చ్ ట్రయాంగిల్ సంస్థ (ఆర్టీఐ) ప్రశంసల జల్లు కురిపించాయి. ప్రజలకు ఉత్తమ వైద్య చికిత్సను అందుబాటులోకి తేవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది,
ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను ఈ రెండు సంస్థలు కూడా జిల్లా స్థాయిలో అధ్యయనం చేశాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి చెప్పారు. ఆయనతో ఢిల్లీ నుంచి ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య వీడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అమలు కాక ముందు కూడా తాము ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేశామని వారు చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత ప్రాథమిక, గ్రామ స్థాయి కేంద్రాల్లో అప్పటి కన్నా ఎక్కువగా వైద్య పరీక్షలు జరిగినట్లు తాము గుర్తించామని వారు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి తాము సలహాలు ఇచ్చామని వారు చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీపై భారం తగ్గుతుందని తాము అంచనా వేసినట్లు జవహర్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై, ముఖ్యంగా మహిళల్లో, బాలికల్లో పోషకాహార లోపం, ఎనిమియాలను నిరోధించడపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు.