Telugu Global
Andhra Pradesh

ఏపీ ఫ్యాక్ట్ చెక్: అప్పట్లో జ్యోతి ఫేక్.. ఇప్పుడు సాక్షి ఫేక్

గతంలో ఇదే అకౌంట్.. వైసీపీపై వచ్చే విమర్శలు, టీడీపీకి అనుకూలంగా ఉన్న కథనాలు తప్పు అని చెప్పింది, ఇప్పుడు అదే ఖాతా నుంచి వైసీపీ చేసే ఆరోపణలు తప్పు అనే వివరణలు బయటకొస్తున్నాయి.

ఏపీ ఫ్యాక్ట్ చెక్: అప్పట్లో జ్యోతి ఫేక్.. ఇప్పుడు సాక్షి ఫేక్
X

ఏపీ ప్రభుత్వం తరపున ఫ్యాక్ట్ చెక్ పేరుతో సోషల్ మీడియాలో ఓ అధికారిక ఖాతా ఉంది. ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆ అకౌంట్ నుంచి కట్టడి చేసే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై చాలానే ఫేక్ న్యూస్ లు బయటకొచ్చేవి. సోషల్ మీడియాలో వచ్చే ఆ కథనాలతోపాటు.. ఎల్లో మీడియా రాతల్ని కూడా ఫేక్ న్యూస్ అంటూ అధికారిక ఖాతా ద్వారా ఖండించేవారు. అసలు వాస్తవాలు ఇవీ అని ప్రజలకు చెప్పేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలను ఎక్కువగా ఫేక్ న్యూస్ అని చెప్పే సదరు ఖాతా, ఇప్పుడు సాక్షి కథనాలు ఫేక్ అంటూ వివరణలు ఇవ్వాల్సి వస్తోంది.


వైజాగ్ గాంధీ ఆస్పత్రిని HCG గ్రూప్ కి కూటమి ప్రభుత్వం రూ.714కోట్లకు అమ్మేసిందంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. దీన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ అకౌంట్ ఖండించింది. ఆ కథనం అవాస్తవం అని తెలిపింది. ఇక చిరువ్యాపారులపై జేసీబీ దాడి అంటూ వచ్చిన కథనం కూడా ఫేక్ అని తేల్చింది. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఘటనను ఏపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి నమ్మొద్దని తెలిపింది.


ప్రజా వేదిక నిర్మాణానికి అయిన ఖర్చు 90 లక్షల రూపాయలయితే, దాన్ని వక్రీకరించారంటూ సాక్షి కథనాన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ తప్పుబట్టింది. అది ఫేక్ వార్త అంటూ కొట్టిపారేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రచారంలో ఉన్న కథనాల్లో అవాస్తవాలు ఉన్నాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ బయటపెట్టింది.


గతంలో ఇదే అకౌంట్.. వైసీపీపై వచ్చే విమర్శలు, టీడీపీకి అనుకూలంగా ఉన్న కథనాలు తప్పు అని చెప్పింది, ఇప్పుడు అదే ఖాతా నుంచి వైసీపీ చేసే ఆరోపణలు తప్పు అనే వివరణలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వం మారాక నిజానిజాలు కూడా మారిపోయాయా, లేక మారాల్సి వచ్చిందా అని నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు.

First Published:  30 Jun 2024 8:31 AM IST
Next Story