హమ్మయ్య..! వాళ్లు కూడా జై జగన్ అనేశారు
ఉద్యోగులంతా భవిష్యత్తులో జగన్ మాకు మంచి చేశాడనుకోవాలనే ఉద్దేశంతోనే ఆయా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలెప్పుడూ ఇంత సిన్సియర్ గా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు జగన్.
ఏపీ ఉద్యోగ వర్గాల్లో కొన్ని యూనియన్లు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిపోయాయి. వీటిలో ఏపీ జేఏసీ అమరావతి కూడా ఒకటి. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గతంలో ఆందోళనలు బాగానే జరిగాయి. తాజాగా ఆందోళనకు జరుగుతున్న క్రమంలోనే పీఆర్సీ కమిటీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయాలు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో బొప్పరాజు వర్గం కూడా చల్లబడింది.
సీపీఎస్ రద్దు చేసినా, ఓపీఎస్ కావాలంటూ గొడవ చేసిన ఆ వర్గం నేతలు, ఇప్పుడు జీపీఎస్ తో సర్దుకుపోయినట్టున్నారు. అందుకే ఈరోజు సీఎం జగన్ ని కలసి ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
నా మనసు ఎప్పుడూ..
ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రంలో డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు సీఎం జగన్. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన మనసు ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయడం కోసమే పరితపిస్తుందని, రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు జగన్.
ఉద్యోగుల సమస్యలను అలా వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారం వల్ల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు. జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని సీఎం జగన్ వివరించారు.
ఆమాటకోసమే ఈ పనిచేశా..
ఉద్యోగులంతా భవిష్యత్తులో జగన్ మాకు మంచి చేశాడనుకోవాలనే ఉద్దేశంతోనే ఆయా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలెప్పుడూ ఇంత సిన్సియర్ గా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు జగన్. సీపీఎస్ రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్ దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని, వారిని పూర్తిగా భాగస్వామ్యులు చేసుకున్నామని చెప్పారు జగన్.
ఉద్యోగుల మొహంలో చిరునవ్వు ఉంటేనే వారు బాగా పని చేయగలుగుతారన్నారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలన్నీ 2 నెలలలోపు అమలులోకి రావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.