మాకు నమ్మకం లేదు జగన్.. ఏపీలో ఈరోజు ఉద్యోగుల సెల్ డౌన్
మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా తమ ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది, జనంలోకి వెళ్తోంది, ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తోంది, ఇంకా నమ్మకం ఎక్కువ ఉన్నవారికి సెల్ ఫోన్ స్టిక్కర్లు కూడా ఇస్తోంది. అయితే ఉద్యోగ వర్గాలు మాత్రం మాకింకా నమ్మకం కుదర్లేదంటున్నాయి. అందుకే తమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఏపీలో ఈరోజు ఉద్యోగులు సెల్ ఫోన్లు వాడకుండా నిబంధన పెట్టుకున్నారు. సెల్ డౌన్ ప్రారంభించారు.
సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా తమ ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. సెల్ ఫోన్ ద్వారా ఉన్నతాధికారులు పంపే సందేశాలను చదవకూడదని, వాట్సప్ ద్వారా వారు పంపించే సూచనలను పాటించకూడదన్నారు.
సోమవారం అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగులు అర్జీలిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంలేదని చెప్పారు. 26 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు సెల్ డౌన్ విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈనెల 12న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ధర్నాలు చేపడతారు.
సీపీఎస్ రద్దు సహా ఇతర అనేక సమస్యలపై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. ఉద్యోగుల్లో రెండు మాడు వర్గాలున్నా కూడా ఎక్కువమంది ఆందోళనలకు మద్దతిస్తున్నారు. నేరుగా ఆందోళనల్లో పాల్గొనకపోయినా, ప్రభుత్వ విధానాలను మాత్రం వారు సమర్థించడంలేదు. సీపీఎస్ పై ఏదో ఒకటి తేల్చాలని, ఇతర బెనిఫిట్స్ ని సకాలంలో తమకు అందేలా చూడాలంటున్నారు ఉద్యోగులు. ఇటీవల ఒకటో తేదీ జీతాల సమస్య ఎక్కువైంది. దీనిపై కూడా దృష్టిపెట్టాలంటున్నారు.