సీఎం జగన్ పై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన ఏపీ ఉద్యోగులు..
విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. మొత్తం 8మంది గవర్నర్ ని కలసి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేశారు.
ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమబాట పట్టేలా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పలుమార్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు ఉద్యోగులు. పీఆర్సీ విషయంలో రచ్చ రచ్చ చేశారు. ఈపీఎస్ రద్దుకోసం విజయవాడలో ధర్నాచేపట్టారు. ఆ తర్వాత చర్చల పేరుతో ఉద్యోగ సంఘాల్ని పలుమార్లు పిలిచి, టీ కాఫీలు ఇచ్చి పంపించేశారు కానీ అసలు హామీ మాత్రం ఇవ్వలేదు. మధ్యే మార్గంగా జీపీఎస్ అంటూ మరో వ్యవహారం తెరపైకి తేవాలనుకున్నా అది కూడా సాధ్యం కాలేదు. ఈ దశలో మరోసారి ఏపీ ఉద్యోగులు తమ అసంతృప్తిని ఈరోజు బయటపెట్టారు. నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్లి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. మొత్తం 8మంది గవర్నర్ ని కలసి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యల పరిష్కారంకోసం చొరవ చూపించాలని వినతిపత్రం అందించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని గవర్నర్ కి వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని అన్నారు ఏపీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
అమ్మో ఒకటో తారీఖు..
ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని నిబంధనలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్ సొమ్ము విత్ డ్రా చేశారన్నారు. 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారని, సాంకేతిక సమస్యలంటూ దాన్ని కవర్ చేసుకున్నారని మండిపడ్డారు. గవర్నర్ ను కలిసి అన్ని విషయాలు వివరించామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. తమ సమస్యలను గవర్నర్ సానుకూలంగా విన్నారని, ఆయన తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
మావి గొంతెమ్మ కోర్కెలా...?
గతంలో ఉద్యోగులు కూడా ఓ మెట్టు దిగి ఆలోచించాలని మంత్రి బొత్స అన్న వ్యాఖ్యలను కూడా ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకరరీతిలో వ్యవహరిస్తోందన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళనలు చేపడామని హెచ్చరించారు. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉపసంఘానికి సమస్యలు చెప్పినా ఫలితం లేకపోవడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు.