Telugu Global
Andhra Pradesh

ఏపీ ఎన్నికలు.. ఆ 5 అంశాలే కీలకం

పథకాలను పక్కనపెడితే ఈ ఎన్నికల సందర్భంగా 5 ప్రధాన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

ఏపీ ఎన్నికలు.. ఆ 5 అంశాలే కీలకం
X

ఏపీ ఎన్నికలకు సంబంధించి అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎటువైపు ఉంటారో తేల్చబోతున్నాయి. నవరత్నాలలో 99శాతం హామీలు అమలు చేశామని, తన ద్వారా లబ్ధిపొందినవారు తనకు ఓటు వేయాలంటున్నారు సీఎం జగన్. జగన్ పథకాలు రాష్ట్రాన్ని దివాళా తీయించాయని, తమకు అవకాశమిస్తే మరిన్ని విచిత్రాలు చేసి చూపిస్తామని అంటున్నాయి ప్రతిపక్షాలు. అయితే హామీల అమలులో చంద్రబాబు ట్రాక్ రికార్డ్.. కూటమికి ప్రధాన అడ్డంకిగా మారింది. పథకాలను పక్కనపెడితే ఈ ఎన్నికల సందర్భంగా 5 ప్రధాన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

ఏపీ స్పెషల్ స్టేటస్..

ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం పాతచింతకాయ పచ్చడేం కాదు. మేం అధికారంలోకి వస్తే హోదా ఇచ్చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ హోదాని హైలైట్ చేశాయి. స్పెషల్ స్టేటస్ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్యాకేజీకి హోదాని తాకట్టు పెట్టింది. అదే విషయంలో చంద్రబాబుని కార్నర్ చేసిన జగన్ కూడా ఎన్డీఏపై ఒత్తిడి తేలేకపోయారు. పార్టీలు పక్కనపెట్టినా.. ప్రజలకు సంబంధించి ఈ ఎన్నికల్లో ఇది కీలక అంశం.

రాజధాని..

అమరావతిని రాజధానిగా ప్రకటించి ఐదేళ్లు తాత్కాలిక నిర్మాణాలతో మోసం చేసి, గ్రాఫిక్స్ తో మాయ చేసి చివరకు అట్టర్ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇక జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించినా ఫలితం లేదు. విశాఖలో రుషికొండ నిర్మాణాలు, కర్నూలులో న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన మినహా పురోగతి లేదు. కోర్టు కేసులతో జగన్ ని వెనక్కు లాగాలని చూసిన ప్రతిపక్షాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యాయి. రాజధాని విషయంలో ఏపీ ప్రజలు ఎవర్ని నమ్ముతున్నారనేది రాబోయే ఫలితాలతో తేలిపోతుంది.

వైఎస్ వివేకా హత్య కేసు..

2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కిరాకపోవడం విశేషం. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ వివేకా కుమార్తె సునీత చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇటీవల షర్మిల కూడా ఆమెకు జతకలవడం చర్చనీయాంశమైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రజా సమస్య కాకపోయినా, ప్రభుత్వాలు పరిష్కరించలేని జటిల సమస్య కావడంతో ఇది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.

కోడికత్తి కేసు..

గత ఎన్నికల ముందు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాడి చేసిన శ్రీనివాసరావు 62 నెలల జైలు జీవితం తర్వాత ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చారు. ఇందులో కుట్ర లేదు, దాడి చేసిన వ్యక్తికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని తేలిపోయింది. ఈ విషయంలో కూడా జగన్ ని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సింపతీకోసం అప్పట్లో కోడికత్తి డ్రామా ఆడారని, అధికారంలో ఉన్నా కూడా ఆ కేసుని తేల్చలేకపోయారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

చంద్రబాబు అరెస్ట్..

ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశముంది. ఆ జైలు ఎపిసోడ్ తర్వాతే టీడీపీతో జనసేన జతకట్టింది, ఆ తర్వాత బీజేపీ కూడా జతకలిసింది, చివరికి కూటమి ఏర్పడింది. జైలు ఎపిసోడ్ ని సింపతీకోసం వాడుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. ఆయన అవినీతికి అది శాంపిల్ మాత్రమేనని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. నాయకుడు జైలుకెళ్తే కచ్చితంగా సింపతీ పెరుగుతుంది అనే సంప్రదాయం ఈసారి చంద్రబాబు విషయంలో నిజమవుతుందో లేదో చూడాలి. లేదా బాబు కుంభకోణాలపై ప్రజలకు మరింత క్లారిటీ వచ్చి ఉంటుందనే విషయం ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.

First Published:  26 March 2024 9:27 AM IST
Next Story