వైసీపీ ఫస్ట్ రియాక్షన్.. విజయసాయి ఏమన్నారంటే..?
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని ఎవరైనా శిరసావహించాలన్నారు విజయసాయిరెడ్డి. అది రాజ్యాంగబద్ధం అని చెప్పారు.
వైసీపీ ఓటమిపై నెల్లూరు ఎంపీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి హుందాగా స్పందించారు. ఏపీ ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని ఎవరైనా శిరసావహించాలన్నారు. అది రాజ్యాంగబద్ధం అని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎదుర్కొన్న ఓటమికి కారణాల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనివాటిని ఏం చేశాం, తాము చేసిన పనుల్ని ప్రజలు ఎందుకు ఆదరించలేదనే విషయాన్ని కూలకంగా చర్చిస్తామన్నారు. జగన్ ఆధ్వర్యంలో సమీక్ష జరుగుతుందన్నారు విజయసాయిరెడ్డి.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా నెల్లూరు లోక్ సభ స్థానానికి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు వైసీపీలో ఉండి, ఎన్నికల సమయంలో టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విజయసాయి పోటీకి దిగారు. చివరకు అక్కడ వేమిరెడ్డి గెలుపొందారు. నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం విశేషం. దీంతో ఎంపీగా విజయసాయిరెడ్డి కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమిని హుందాగా స్వీకరించారాయన. ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామని చెప్పారు.
వాస్తవానికి వైసీపీ ఓటమి ఎవరికీ మింగుడు పడటం లేదు. 175 స్థానాల్లో గెలిచేస్తామని పైకి గంభీరంగా చెప్పినా గతంలోకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం వారికి ఉంది. అయితే అనూహ్యంగా సీట్ల సంఖ్య మరీ కుదించుకుపోవడం, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడంతో వైసీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉండిపోయారు.