Telugu Global
Andhra Pradesh

సోషల్ మీడియా రౌడీలకు ఏపీ డీజీపీ వార్నింగ్

మనమే వస్తున్నాం, వారి సంగతి తేలుస్తామంటూ.. వాట్సప్ స్టేటస్ లు పెట్టుకోవడం కూడా సరికాదని చెప్పారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వాట్సప్ గ్రూపులపై కూడా నిఘా ఉంటుందన్నారు.

సోషల్ మీడియా రౌడీలకు ఏపీ డీజీపీ వార్నింగ్
X

నీ అంతు చూస్తా..

నీ సంగతి తేలుస్తా..

మాతో పెట్టుకుంటే మటాషే..

రిజల్ట్ వచ్చాక నీ పని క్లోజ్..

రౌడీలు, గూండాలుగా చెలామణి అయ్యేవాళ్లు సహజంగా ఇలాంటి వార్నింగ్ లు ఇస్తుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా రౌడీల బ్యాచ్ తయారైంది. సోషల్ మీడియాలో వీళ్లు వార్నింగ్ లు ఇస్తుంటారు. ఏపీ ఎన్నికల వేళ ఈ వ్యవహారం మరింత ముదిరింది. "కౌంటింగ్ తర్వాత మనమే అధికారంలోకి వస్తాం వాళ్లందరి సంగతి తేలుస్తా"మంటూ ఇటీవల ఓ బ్యాచ్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. "ఫలానా వాడిని టార్గెట్ చేయండి, ఫలానా వాడు రెచ్చిపోతున్నాడు, ముందు వాడి సంగతి చూడండి.." అనే మెసేజ్ లు కోకొల్లలు. అలాంటి వ్యవహారాలపై ఏపీ పోలీస్ లు నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో వార్నింగ్ లు ఇచ్చేవారిపై ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.


సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ.. సోషల్ మీడియాతో అల్లర్లు సృష్టించాలనుకునేవారికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేశారు. కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, మరికొందరు కౌంటింగ్ తర్వాత అంతూ చూస్తామంటూ సవాళ్లు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని, అలాంటివారిని ఉపేక్షించేది లేదని చెప్పారాయన. అలాంటి పోస్టింగ్ లు పెట్టాలని ప్రోద్బలం చేసేవారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.

మనమే వస్తున్నాం, వారి సంగతి తేలుస్తామంటూ.. వాట్సప్ స్టేటస్ లు పెట్టుకోవడం కూడా సరికాదని చెప్పారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వాట్సప్ గ్రూపులపై కూడా నిఘా ఉంటుందన్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడంతోపాటు, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఘాటుగా హెచ్చరించారు.

First Published:  3 Jun 2024 8:09 PM IST
Next Story