పవన్ నీ పార్టీ గుర్తు ఏంటో ప్రజలకు చెప్పగలవా..?
చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు అంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడని, ఇప్పుడు వారితోనే కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నాడని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా ఎన్నికల్లో పోటీ చేసింది ఒక్కసారి మాత్రమే. 2014లో ఆయన టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపి ఆ పార్టీల తరఫున ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రమే జనసేన పోటీచేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు, ఉప ఎన్నికలకు జనసేన దూరం ఉండటంతో ఎన్నికల సంఘం పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు రద్దు అయ్యింది. అయితే కొద్ది నెలల విరామం తర్వాత మళ్ళీ ఇటీవల ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో స్థిరమైన సింబల్ కూడా లేని పార్టీ జనసేన అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నీ పార్టీ గుర్తు ఏంటో ప్రజలకు చెప్పగలవా..? అంటూ నారాయణస్వామి సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి సింబల్ లేదని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో కూడా అతడికి క్లారిటీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడను అని చెబుతూనే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చేరి విజిల్స్ వేస్తున్న వారంతా క్రిమినల్సే అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రభుత్వం నడుస్తోందని నారాయణస్వామి అన్నారు. పేదల గురించి, వారి సమస్యల గురించి పవన్ కళ్యాణ్‌కి ఏం తెలుసో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు అంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడని, ఇప్పుడు వారితోనే కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నాడని విమర్శించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి నరరూప రాక్షసులు అందరూ ఒక్కటవుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తాను ఒక్కరోజు షూటింగ్‌కు వెళ్తే రెండు కోట్ల రూపాయలు ఇస్తారని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడని.. మరి అన్ని కోట్లు తీసుకునే ఆయన సొంత సామాజిక వర్గానికి ఏ రోజు అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా..? అని ఆయన ప్రశ్నించారు.