Telugu Global
Andhra Pradesh

జగన్‌ పాలన బాగుందన్న వ్యక్తి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ఓ గ్రామస్తులు కమ్మ సామాజిక వర్గం జగన్ వైపే ఉందని చెప్పడంతో డిప్యుటీ సీఎం నారాయణ స్వామి పాదాభివందనం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటు చేసుకోవడం విశేషం.

జగన్‌ పాలన బాగుందన్న వ్యక్తి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
X

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యవహార శైలి కాస్త విభిన్నంగా ఉంటుంది. తన మనసులో ఏదనిపిస్తే అది చేసేస్తుంటారు. తన హోదా ఏమిటో కూడా పెద్దగా ఆలోచించరు. తాజాగా ఆయన ఓ వ్యక్తి కాళ్లు మొక్కడం చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ముందస్తు వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో నాయకులు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లోకన్నా ఏపీలో సామాజిక సమీకరణలు ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి. గత ఎన్నికల్లో జగన్ గెలుపులో ఈ సమీకరణలే పని చేశాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమ్మ వర్గంలో చాలా మంది జగన్ వైపునకు మొగ్గు చూపడంతోనే అధికారంలోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా కమ్మ సామాజిక వర్గం దూరమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామస్తులు కమ్మ సామాజిక వర్గం జగన్ వైపే ఉందని చెప్పడంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాదాభివందనం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటు చేసుకోవడం విశేషం.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మొరవకండ్రిగలో నారాయణ స్వామి పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. జగన్ పరిపాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పూర్తిగా వివరించారు. ఈ క్రమంలో ఓ ఇంటి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న మహిళలతో ముచ్చటించారు. డ్వాక్రా రుణ మాఫీ జరిగిందా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. అవును మాఫీ అయ్యిందని మహిళ సమాధానం ఇచ్చారు. పెన్షన్ వస్తుందా అని అడగ్గా.. వస్తుందని అన్నారు. అయితే, మీకా లేదంటే ఆ పెద్దాయనకా అని అడగ్గా.. పక్కనే ఉన్న వ్యక్తి.. తనకే పెన్షన్ వస్తుందన్నారు.

తాను రైతునని, తన పేరు రాధా నాయుడు అని చెప్పారు. తమకు ఏయే పథకాలు అందుతున్నాయో రాధానాయుడు పూర్తిగా డిప్యూటీ సీఎంకు వివరించారు. సీఎం జగన్ పాలన బాగుందని.. మరోసారి ఆయనే అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందని రాధా నాయుడు వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. దీంతో వెంటనే డిప్యుటీ సీఎం నారాయణ స్వామి సదరు రైతు రాధానాయుడుకు పాదాభివందనం చేశారు. కమ్మ సామాజిక వర్గంలో మార్పు వచ్చిందని, ఆ వర్గంలో వాళ్లు కూడా జగన్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారని డిప్యుటీ సీఎం సదరు వ్యక్తి కాళ్లు మొక్కారు.

కమ్మ సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతుందని కొంత కాలంగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈ ఘటన తెలియజేస్తోందని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. అదంతా ప్రత్యర్థి పార్టీలో చేస్తున్న దుష్ప్రచారం అని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు వచ్చే సారి కూడా జగన్ నాయకత్వాన్ని సమర్థించబోతున్నారని, తిరిగి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నారాయణ స్వామి కాళ్లు మొక్కిన వీడియో వైరల్‌గా మారింది.



First Published:  2 Dec 2022 8:15 AM IST
Next Story