Telugu Global
Andhra Pradesh

పవన్‌ యాత్ర ఎందుకు ఆపేశాడో ప్రజలకు చెప్పాలి.. - డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ

లోకేష్‌ తండ్రి పాలనను తలపిస్తానని చెబుతాడా? తాత ఎన్టీఆర్‌ పాలనను తలపిస్తానని చెబుతాడా? స్పష్టం చేయాలని మంత్రి కొట్టు డిమాండ్‌ చేశారు.

పవన్‌ యాత్ర ఎందుకు ఆపేశాడో ప్రజలకు చెప్పాలి.. - డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ
X

అట్ట‌హాసంగా వారాహికి పూజ‌లు చేసి యాత్ర కోసం సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ యాత్ర‌ను ఎందుకు ఆపేశాడో, ఎవ‌రి కోసం ఆపేశాడో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలో సోమ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించ‌డంతో ప‌వ‌న్‌ యాత్ర విర‌మించాడ‌ని, వారాహికి పూజ‌ల‌తోనే స‌రిపెట్టాడ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. చంద్రబాబు, పవన్‌ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కోరి ద‌రిద్రాన్ని ఎవ‌రూ నెత్తిన పెట్టుకోరు..

చంద్ర‌బాబుకు వ‌య‌సుడిగిపోవ‌డం వ‌ల్లే త‌న కుమారుడు లోకేష్‌ని పాద‌యాత్ర‌కు పంపించాడ‌ని చెప్పారు. పాద‌యాత్ర చేస్తే ముఖ్య‌మంత్రి అవుతారా అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌శ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు పాలనను రాష్ట్ర ప్రజలు ఛీకొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయ‌న‌ గుర్తు చేశారు. నాడు చంద్రబాబు హయాంలో నిర్వహించిన బెల్టుషాపులకు తమ పాలనలో చెక్‌ పెట్టినట్టు చెప్పారు. నాడు జ‌న్మ‌భూమి క‌మిటీల‌తో ప్ర‌జ‌ల‌ను దోచుకుతిన్నార‌ని, పింఛ‌ను అందుకునేందుకు వృద్ధులు కిలోమీట‌ర్ల దూరం వెళ్లి గంట‌ల‌త‌ర‌బ‌డి వేచి చూసి తీసుకోవాల్సి వ‌చ్చేద‌ని తెలిపారు. వారికిచ్చిన అర‌కొర పింఛ‌ను సొమ్ములోనూ జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు కొంత ముట్ట‌చెప్పాల్సి వ‌చ్చేద‌ని గుర్తుచేశారు. అలాంటి ద‌రిద్ర‌పు పాల‌నను కోరి ఎవ‌రూ నెత్తిన పెట్టుకోర‌ని ఆయ‌న చెప్పారు.

లోకేష్‌ తండ్రి పాలనను తలపిస్తానని చెబుతాడా? తాత ఎన్టీఆర్‌ పాలనను తలపిస్తానని చెబుతాడా? స్పష్టం చేయాలని మంత్రి కొట్టు డిమాండ్‌ చేశారు. రాజకీయాలపై కనీస అవగాహన లేని, తెలుగు మాట్లాడలేని లోకేష్‌ నాయుడు ప్రజలకు ఏం చెబుతాడ‌న్నారు. ఈ క్రమంలోనే అల్లర్లు సృష్టించి దానిని అధికార పక్షంపై నెట్టేయాలని చంద్రబాబు కుట్రపూరితంగా పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నాడ‌ని ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ్యానిఫెస్టోను ప‌విత్ర గ్రంథంగా భావించి ప్ర‌తి హామీనీ అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి చెప్పారు. ప్రజలు ఆయన పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని విమర్శించారు. జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం రావడం లేదన్నారు. జగన్‌ రూపంలో రాష్ట్రానికి మంచి నాయకత్వం వచ్చిందన్నారు. ఆ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు నిలబెట్టుకోవాలన్నారు.

First Published:  31 Jan 2023 8:23 AM IST
Next Story