పవన్‌కి దబ్బలంతో పొడిచినా నొప్పి తెలియట్లేదు..
పవన్ జనసేన పార్టీని స్థాపించింది తాను సీఎం కావడం కోసం కాదని, టీడీపీ కోసం పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టారని మంత్రి చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌కి దబ్బలంతో పొడిచినా నొప్పి తెలియడం లేదని, టీడీపీ మత్తులో జోగుతుండటం వల్లే పవన్ ఈ పరిస్థితిలో ఉన్నాడని మంత్రి చెప్పారు. తాడేపల్లిగూడెంలో గురువారం సాయంత్రం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ తన జీవితాంతం చంద్రబాబు కోసమే పనిచేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఒకవేళ ఆ పార్టీలో ఎవరైనా దానిని వ్యతిరేకిస్తే పార్టీలో ఉండవలసిన అవసరం లేదు, బయటకు వెళ్లిపోవచ్చని నిస్సిగ్గుగా చెప్తున్నాడన్నారు.
పవన్ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు..
పవన్ జనసేన పార్టీని స్థాపించింది తాను సీఎం కావడం కోసం కాదని, టీడీపీ కోసం పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టారని మంత్రి చెప్పారు. బాబును సీఎం చేయడమే లక్ష్యమంటూ కార్యకర్తలకు బహిరంగంగా చెబుతున్న పవన్‌ది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పవన్ ఇక జీవితంలో సీఎం కానప్పుడు జనసైనికులు జనసేన పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని ఆయన ప్రశ్నించారు. పవన్ నిర్ణయం తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేలా ఉంది కానీ జనసేనను ముందుకు తీసుకువెళ్లేలా లేదన్నారు. అటువంటి పవన్ కోసం పని చేయవలసిన అవసరం ఉందా అని జనసేన తమ్ముళ్లు ఒకసారి ఆలోచించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు.
జరగబోయేది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం..
పేదల పొట్ట కొట్టి పెత్తందారులకు పెట్టడం చంద్రబాబు విధానమైతే పేదల కోసం పనిచేయడం సీఎం వైఎస్ జగన్ విధానమని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. 2024లో జరగబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంటే పెత్తందారుల కోసం పని చేసే తెలుగుదేశం చూసి ఓర్వలేకపోతోందన్నారు. తెలుగుదేశం, చంద్రబాబు, పవన్, లోకేష్, ఆ పార్టీ అనుకూల శక్తులు.. ఇలా దుష్టశక్తులన్నీ కలిసి మారీచుల వలే వేషాలు మార్చి ప్రజలను మోసం చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
పవన్‌తో వెళితే.. ఒడ్డుకు చేరలేరు..
తెలుగుదేశం కోసం పనిచేసే పవన్‌తో వెళితే ఒడ్డుకు చేరలేరని జనసైనికులకు మంత్రి హితవు పలికారు. ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని లోకేష్ ప్రకటించిన దానికి పవన్ ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో నోటాతో పోటీపడిన జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నాయకులు అవహేళన చేస్తున్నారని, అయినా పవన్‌కు చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. జనంలో ఎలాంటి బలం లేని పవన్‌తో తమకు పనిలేదని, జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారన్నారు. అయినా పవన్ తెలుగుదేశాన్ని పట్టుకుని అంటకాగడం కాపు జాతికి తీరని అవమానమన్నారు. రంగా హత్య, ముద్రగడ కుటుంబీకులకు వేధింపులు, రత్నాచల్ దహనంలో అక్రమ కేసులు వంటి వాటితో కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశానికి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దీని కోసమే పవన్ ద్వారా ఆ వ్యతిరేకత నుంచి బయటపడాలని చంద్రబాబు కుట్ర పన్నాడని మంత్రి విమర్శించారు. దారితప్పి పక్క దారిలో నడుస్తున్న కొందరు కాపు సోదరులకు నిజాలు చెప్పి కనువిప్పు కలిగించవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.