పుట్టిన తేదీ నిరూపించుకోవాలంటే.. బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
కేంద్ర కొత్త చట్టం ప్రకారం ఏడు రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
మీ పుట్టిన తేదీ నిరూపణకు ఇప్పటి వరకు పదో తరగతి మార్కుల లిస్టు లాంటివి చూపిస్తున్నారు కదా.. 2023 అక్టోబర్ 1వ తేదీ తర్వాత పుట్టినవారికి మాత్రం బర్త్ సర్టిఫికెటే పుట్టినతేదీ నిరూపణ పత్రం. వేరే ఏ రకమైన డాక్యమెంటూ చెల్లదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోనూ అమలు చేయబోతున్నట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని కలెక్టర్లందరూ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఏడు రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి
కేంద్ర కొత్త చట్టం ప్రకారం ఏడు రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా వెంటనే తమ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లల వివరాలను హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్‌కు అందించాలన్నారు.
అన్నింటికీ తప్పనిసరి
స్కూల్ అడ్మిషన్, ఉద్యోగ నియామకాలతోపాటు ఆధార్ నంబర్, డ్రైవింగ్ లెసైన్సు, పాస్‌పోర్టు జారీకి బర్త్ సర్టిఫికెట్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంతకుముందు వీటికి పదో తరగతి మార్కుల లిస్ట్ వంటి ప్రత్యామ్నాయాలు ఉండేవి. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టినవారందరికీ బర్త్ సర్టిఫికెట్ లేకపోతే ఏ పనీ ముందుకు సాగదన్న మాట!