ఫస్ట్ వికెట్ సీఎస్.. మరికొందరి మెడపై టీడీపీ కత్తి
సాయంత్రంలోగా టీడీపీకి అనుకూలమైన కొత్త అధికారి సీఎస్ గా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల టైమ్ లో ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన కూటమి.. ఇప్పుడాయన్ను పక్కకు తప్పించింది. ఆయన్ను సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నా కూడా హడావిడిగా ఆయన్ను పక్కకు తప్పించారు. సీఎస్ తోపాటు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్టు తెలిపారు. సాయంత్రంలోగా టీడీపీకి అనుకూలమైన కొత్త అధికారి సీఎస్ గా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
సలహాదారులపై వేటు..
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొందరు సలహాదారులు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే రాజీనామా చేయని వారిని తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరికొన్ని కీలక స్థానాల్లో ఉన్నవారిని కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు ఈ పరిణామాలను ఊహించి ముందుగానే హుందాగా వైదొలిగారు.
టీచర్ల బదిలీలకు బ్రేక్..
మరోవైపు ఏపీలో టీచర్ల బదిలీలకు కూడా బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలు ముందు వరకు ఏపీలో రాజకీయ నాయకుల సిఫారసులతో టీచర్ల బదిలీలు జరిగాయి. 1800 మందిని బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, అంతలోనే కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆ ట్రాన్స్ ఫర్ లు ఆగిపోయాయి. ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో తిరిగి ఆ బదిలీలు కొనసాగించే అవకాశం ఏర్పడింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ బదిలీలు జరగకూడదనే ఆదేశాలు అందాయి. దీంతో బదిలీ ఉత్తర్వులు పొంది కూడా ట్రాన్స్ ఫర్ కాలేకపోయిన ఉపాధ్యాయులు షాకయ్యారు.