Telugu Global
Andhra Pradesh

ఏపీలో కొనసాగుతున్న కాంగ్రెస్ కామెడీ రాజకీయం

సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం వైసీపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది' అని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

ఏపీలో కొనసాగుతున్న కాంగ్రెస్ కామెడీ రాజకీయం
X

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎంత బలంగా ఉండేదో అందరికీ తెలుసు. ఎప్పుడైతే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణను ఏర్పాటు చేసిందో అప్పటినుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు చాలా చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

కనీసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేందుకు సరైన నేత దొరక్క.. ఒకప్పుడు ఉద్దండులు పని చేసిన అధ్యక్ష స్థానంలో ఇప్పుడు అనామక నేతలు పనిచేస్తున్నారు. అలా నియమితులైన నేతలు కామెడీ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ కు ఉన్న పరువును కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు పనిచేస్తున్నారు. ఆయన తరచూ మీడియా ముందు కామెడీ మాటలు మాట్లాడుతూ వినోదం పంచుతున్నారు.

కొన్ని నెలల కిందట మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లో ఉన్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ తరపున ఐడీ కార్డు ఇప్పించారు. అప్పట్లో ఈ వ్యవహారం నవ్వులు పంచింది. రాజకీయాల్లో లేని వ్యక్తికి ఐడీ కార్డు ఇవ్వడం ఏంటనే మాటలు వినిపించాయి. ఆ తర్వాత కూడా ఈ విషయంలో రుద్రరాజు కామెడీ ఆగలేదు. ఇటీవల ఒంగోలులో పర్యటించిన సమయంలో కూడా రుద్రరాజు మాట్లాడుతూ ఇంకా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్ తో టచ్ లో ఉన్నట్లు చెప్పారు.

ఇవాళ తిరుపతిలో ఆయన సీఎం జగన్ గురించి మీడియాతో మాట్లాడుతూ మరోసారి తన మాటలతో నవ్వుల పాలయ్యారు. సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

'వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సిద్ధం చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో పార్టీ కనీసం వంద స్థానాలు గెలుస్తుంది. ప్రాణ త్యాగాల నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్.. ఈ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉంది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం వైసీపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది' అని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు.

అయితే మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రమంతటా భూతద్దం పెట్టి వెతికినా పార్టీలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న నాయకుడు కనిపించడు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో కూడా పట్టుమని రెండు వేల ఓట్లు తెచ్చే నేత లేడు.. అలాంటి పార్టీని చూసి వైసీపీ భయపడడం ఏంటి? అని జనం నవ్వుతున్నారు.

First Published:  20 Feb 2023 5:17 PM IST
Next Story