కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైపోయిందా?
ప్రభుత్వం తమకు పంపిన నోటీసులను అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీ ట్రెజర్‌కు పంపారు. వెంటనే రూ.1.4 కోట్లను అందిస్తే పార్టీ కార్యాలయాలు కట్టాల్సిన బకాయిలను చెల్లిస్తామని లేఖ కూడా రాశారు. అయితే బకాయిల చెల్లింపునకు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని ట్రెజర్ ఉచిత సలహా పడేశారట. దాంతో ఏమిచేయాలో తెలియక పార్టీ నేతలందరికీ గిడుగు రుద్రరాజు లేఖలు రాస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పార్టీ ఆఫీసుల నిర్వహణ కోసం కూడా డబ్బులకు వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ సమయంలోనే పార్టీ ఆఫీసుల ఆస్తి పన్ను కట్టాలని ప్రభుత్వం నుండి నోటీసులు అందాయి. దాంతో పార్టీ దయనీయమైన పరిస్థితి ఏమిటో కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. రాష్ట్రంలోని తొమ్మిది పార్టీ కార్యాలయాలు రూ.1.4 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నుండి నోటీసులు అందాయి.
నిర్దేశిత సమయంలోగా చెల్లించకపోతే యాక్షన్ తీసుకుంటానని కూడా ప్రభుత్వం నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. యాక్షనంటే ముందు వాటర్ , కరెంట్ కట్ చేస్తుంది. అప్పటికి కూడా పన్ను కట్టకపోతే చివరకు ఆఫీసులకు తాళాలు వేయటం గ్యారెంటీ. ఇప్పటికే ఒకసారి వైజాగ్ పార్టీ ఆఫీసుకు ప్రభుత్వం తాళాలు వేస్తే ఎలాగోలా అవస్థలు పడి తాళాలు తెరిపించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తొమ్మిది కార్యాలయాలకు నోటీసులు అందటంతో ఏమి చేయాలో తెలియక దిక్కలు చూస్తున్నారు.
ప్రభుత్వం తమకు పంపిన నోటీసులను అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీ ట్రెజర్‌కు పంపారు. వెంటనే రూ.1.4 కోట్లను అందిస్తే పార్టీ కార్యాలయాలు కట్టాల్సిన బకాయిలను చెల్లిస్తామని లేఖ కూడా రాశారు. అయితే బకాయిల చెల్లింపునకు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని ట్రెజర్ ఉచిత సలహా పడేశారట. దాంతో ఏమిచేయాలో తెలియక పార్టీ నేతలందరికీ గిడుగు రుద్రరాజు లేఖలు రాస్తున్నారు. బకాయిలు చెల్లించేందుకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు విరాళాలు ఇవ్వాలంటూ లేఖల్లో విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం.
ఇంతకుముందున్న అధ్యక్షుల సమయంలో కూడా నోటీసులు అందినా చెల్లించకుండా ఎలాగోలా మ్యానేజ్ చేశారు. అప్పటి నుండి పెరిగిపోయిన బకాయిలన్నీ ఇప్పుడు గిడుగు మెడకు చుట్టుకుంది. పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వారితో పాటు వివిధ పదవులు అనుభవించిన వాళ్ళంతా తలా చేయి వేయకపోతే కష్టమని గిడుగు భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ కోలుకుంటుందని నమ్మకం ఉన్న నేతలైతే విరాళాలిస్తారు. నమ్మకం పోయిన తర్వాత విరాళాలిచ్చే నేతలు ఎవరుంటారు?