ఆనం రూటు ఎటు..? తాజాగా కాంగ్రెస్ నేతలతో భేటీ..
టీడీపీ నుంచి ఆమేరకు సిగ్నల్స్ వచ్చాయో లేవో తెలియదు కానీ, ఆనం మాత్రం గుంభనంగా ఉన్నారు. మనసులో మాట బయటకు చెప్పడంలేదు. ఈ దశలో ఆనం ఇంట్లో కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తికరంగా మారింది.
వైసీపీ పొగపెట్టిన తర్వాత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంకా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు. నెల్లూరు జిల్లాలోనే మరో రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం తనకు టీడీపీ టికెట్ పై పోటీ చేయాలనే ఆశ ఉందని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆనం మాత్రం ఎందుకో సందిగ్ధంలో ఉన్నారు. టీడీపీలోకి వెళ్తానని ఆయన కచ్చితంగా చెప్పట్లేదు. అదే సమయంలో ఆయన్ను స్థానిక జనసేన నేతలు కూడా కలవడం విశేషం. జనసేనలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటూ ఆనం లీకులిచ్చారు. తాజాగా ఆయన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుని ఇంటికి ఆహ్వానించారు. ఆనం ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. అసలింతకీ ఆనం మనసులో ఏముంది..? ఆయన ఎటు వెళ్లాలనుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో అయిష్టంగానే ఆనం కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ, అక్కడినుంచి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉంటూ చివరకు రెబల్ ముద్రతో బయటకొచ్చేశారు. ఈలోగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీకి బైబై చెప్పడం సంచలనంగా మారింది. ఆయన అదే స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఆనంకి కాంపిటీషన్ మొదలైంది. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్మకూరు నుంచి తన కుమార్తెను పోటీకి దింపాలనే ఆలోచన కూడా ఉంది. సో నెల్లూరు జిల్లానుంచి వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాలు తమ కుటుంబానికి ఇచ్చే పార్టీయే ఆయనకు కావాలి. అది కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితేనా అనంకు లాభసాటిగా ఉంటుంది.
టీడీపీ నుంచి ఆమేరకు సిగ్నల్స్ వచ్చాయో లేవో తెలియదు కానీ, ఆనం మాత్రం గుంభనంగా ఉన్నారు. మనసులో మాట బయటకు చెప్పడంలేదు. ఈ దశలో ఆనం ఇంట్లో కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తికరంగా మారింది. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు , ఏఐసీసీ సెక్రటరీ మయప్పన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సహా మరికొందరు నేతలు ఆనంను ఆయన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంటసేపు వారి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇంతకీ ఆనం రూటు ఎటు..? కాంగ్రెస్ నేతలను ఇంటికి పిలిచి మరీ మర్యాద ఎందుకు చేశారు..? టీడీపీపై ఒత్తిడి పెంచుతున్నారా..? ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఏయే సీట్లు కావాలి..? అనే విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.