గంగవరం పోర్టుపై అడ్డగోలుగా అబద్ధాలు చెప్పేస్తున్న షర్మిల
నిజానికి గంగవరం పోర్టులో 90 శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబానిది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రమోటరు డీవీఎస్ రాజు గంగవరం పోర్టు లిమిటెడ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక కూటమిలో కొత్తగా చేరిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ ప్రభుత్వంపై అబద్ధాలతో ప్రచారం మొదలుపెట్టేశారు. 70 వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును ప్రభుత్వ పెద్దలు రూ.600 కోట్లకు అమ్మేశారంటూ పచ్చి అబద్దాలు అల్లేశారు. అసలు ఆ పోర్టు మొత్తం విలువే రూ.6,200 కోట్లని.. అందులో కేవలం 10 శాతం వాటా ఉన్న ప్రభుత్వం ఆ పోర్టును ఎలా అమ్మగలుగుతుందన్న కనీస విచక్షణాజ్ఞానాన్ని కూడా ప్రదర్శించకుండా షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుండటం దారుణం.
90 శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబానిదే
నిజానికి గంగవరం పోర్టులో 90 శాతం వాటా డీవీఎస్ రాజు కుటుంబానిది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రమోటరు డీవీఎస్ రాజు గంగవరం పోర్టు లిమిటెడ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1,800 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రతిఫలంగా పోర్టులో 10.4 శాతం వాటాను తీసుకుంది. పోర్టులో రాజు కుటుంబ వాటాను రూ.6,200 కోట్ల వాల్యుయేషన్‌తో అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అయితే పోర్టు విస్తరణకు వీలుగా ప్రభుత్వ వాటా కూడా విక్రయించాలని కొనుగోలుదారు కోరారు. దీంతో ప్రభుత్వం నిపుణులు సూచించిన ధరకన్నా రూ.20 కోట్లు అధికంగానే.. అంటే రూ.644.45 కోట్లకు దీన్ని విక్రయించింది. అలా వచ్చిన సొమ్ముతో ఇప్పుడు మరో మూడు కొత్త పోర్టులను ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేస్తోంది.
మారింది నిర్వహణ మాత్రమే
డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ వార్‌బర్గ్ పింకస్ చేతి నుంచి అదానీ గ్రూపు చేతికి మారింది పోర్టు నిర్వహణ మాత్రమే. అంతే తప్ప ప్రభుత్వంతో గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులూ లేవు. అవేమీ తెలుసుకోకుండా పోర్టును భూములతో సహా విక్రయించేసినట్లు షర్మిల మాట్లాడటం అబద్ధం అనుకోవాలా? అవగాహనలేమి అనుకోవాలా?
ప్రైవేట్ వ్యక్తుల డీల్‌తో ప్రభుత్వానికేం సంబంధం?
గంగవరం పోర్టు డీవీఎస్ రాజుదో, అదానీదో కాదు. అది ప్రభుత్వంతో 30 ఏళ్ల లీజు ఒప్పందం. లీజు గడువు ముగిశాక పోర్టు ఆస్తులు, భూములు అన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. లీజు, రాయల్టీ రూపంలో గత రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.60 కోట్ల ఆదాయం వచ్చింది. అలాంటి పోర్టును ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రూ.600 కోట్లకు ఎలా విక్రయిస్తుందన్న కనీస స్పృహ లేకుండా ఏపీసీసీ చీఫ్ మాట్లాడటమే విడ్డూరం.
రూ.70 వేల కోట్లు ఎక్కడివబ్బా!
డీవీఎస్ రాజు గ్రూపు–అదానీ గ్రూపు గంగవరం పోర్టు విలువను ఆర్థిక సంస్థల చేత మదింపు చేయించాయి.. ఆ సంస్థలు పోర్టు విలువను రూ.6,200 కోట్లుగా లెక్కగట్టాయి. అదే ధరకు డీవీఎస్ రాజు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకున్న వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. మరి షర్మిల రూ.70వేల కోట్లు విలువైన పోర్టు అని ఎలా అంటారు..? అంటే ఆమెకు ఆర్థిక సంస్థలను మించి మదింపు పరిజ్ఞానం ఉందేమో మరి!