Telugu Global
Andhra Pradesh

అత్యంత అరుదైన రికార్డుకు సమీపంలో జగన్‌

జమ్ముకశ్మీర్‌లో అయితే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకుడు షేక్‌ అబ్దుల్లా, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫరూక్‌ తర్వాత ఒమర్‌ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు. వీరు మూడు తరాల వారూ సీఎంలు అయ్యారు.

అత్యంత అరుదైన రికార్డుకు సమీపంలో జగన్‌
X

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే అత్యంత అరుదైన రికార్డుకు అతి సమీపంలో ఉన్నారు. ఏపీ సీఎంగా ఆయన 2019లో పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే ఈ అరుదైన రికార్డు ఆయన పేరిట నమోదవుతుంది. అదెలాగంటే..

మన దేశంలో తండ్రీకొడుకులు సీఎంలు కావడం పలు రాష్ట్రాల్లో చూస్తున్నదే. మహారాష్ట్రలో శంకర్‌ రావు చవాన్‌ – అశోక్‌ చవాన్, జమ్ముకశ్మీర్‌ లో షేక్‌ అబ్దుల్లా – ఫరూక్‌ అబ్దుల్లా – ఒమర్‌ అబ్దుల్లా, ఒడిశాలో బిజూ పట్నాయక్‌ – నవీన్‌ పట్నాయక్, యూపీలో ములాయం సింగ్‌ యాదవ్‌–అఖిలేశ్‌ యాదవ్, కర్ణాటకలో దేవెగౌడ–కుమారస్వామి, తమిళనాడులో కరుణానిధి–ఎంకే స్టాలిన్‌.. ఇలా తండ్రీకొడుకులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇక వైఎస్‌ జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటివరకు ఎవరూ ఆ ఘనతను సాధించలేదు. అది ఒక్క వైఎస్‌ జగన్‌కు మాత్రమే సొంతమైంది.

ఉమ్మడి ఏపీలో పలువురు సీఎంల కుమారులు చురుగ్గా వ్యవహరించినా.. వారెవరూ ఆ తర్వాత ముఖ్యమంత్రి కాలేదు. జగన్‌ మాత్రం తన తండ్రి అకాల మరణం తర్వాత సొంత పార్టీని పెట్టుకొని 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యే అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యారు. 2019లో మాత్రం ఘన విజయం సాధించి ఆ ఘనత సాధించారు. జమ్ముకశ్మీర్‌లో అయితే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకుడు షేక్‌ అబ్దుల్లా, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫరూక్‌ తర్వాత ఒమర్‌ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు. వీరు మూడు తరాల వారూ సీఎంలు అయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే.. పైన పేర్కొన్న పలు రాష్ట్రాల్లోని తండ్రీకొడుకులు సీఎంలు అయినప్పటికీ వరుసగా రెండుసార్లు ఎవరూ ఆ పీఠంపై కూర్చోలేకపోయారు. కానీ ఆ అరుదైన రికార్డు ఇప్పుడు ఏపీలో జగన్‌ ముందు నిలిచి ఉంది. వైఎస్సార్‌ 2004, 2009లో వరుసగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్‌.. 2024లోనూ విజయం సాధిస్తే.. ఆయన తన తండ్రి వైఎస్సార్‌లా వరుసగా రెండోసారి సీఎం అయిన రికార్డును సమం చేస్తారు. ఇప్పటివరకూ మన దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనత సాధించేందుకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలతో ఆ విషయం తేలిపోతుంది.

First Published:  1 May 2024 3:11 PM IST
Next Story