చిన్నారి బాధ తెలుసుకొని చలించిపోయిన సీఎం జగన్.. కలెక్టర్‌కు కీలక ఆదేశాలు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రపంచంలో ఎక్కడ చికిత్స అందుబాటులో ఉంటే అక్కడ చేయించాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. ఆర్థిక కష్టాలతో తమ చిన్నారికి వైద్యం చేయించలేకపోతున్న తల్లిదండ్రులకు 'నేను ఉన్నాను' అనే భరోసా ఇచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రపంచంలో ఎక్కడ చికిత్స అందుబాటులో ఉంటే అక్కడ చేయించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో భాగంగా ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ దిగి సభా ప్రాంగణం వద్దకు వెళ్తుండగా ఓ చిన్నారిని పట్టుకొని ఇద్దరు వ్యక్తులు తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపించారు. వెంటనే వారిని గమనించి దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రేగడి మండలం చిన్న సిర్లాం గ్రామానికి చెందిన అప్పల నాయుడు, కృష్ణవేణిల కూతురు ఇంద్రజ పుట్టినప్పటి నుంచి తలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కూతురు ఆరోగ్యం బాగుపడాలని రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించినా వ్యాధి నయం కాలేదు. దీంతో చిన్నారిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతున్నారు.
వీరి బాధను గమనించిన సామాజిక కార్యకర్త సిద్ధార్థ.. సీఎంను కలిస్తే ఏదైనా సాయం చేయవచ్చని చెప్పారు. నరసన్నపేటకు సీఎం వస్తున్నారని తెలుసుకొని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్నారు. తమను చూసిన జగన్‌కు చిన్నారి బాధను వివరించారు. సీఎం జగన్ అరుదైన వ్యాధి గురించి తెలుసుకొని చలించిపోయారు. సిద్ధార్థతో పాటు తల్లిదండ్రులను ఏం చేయాలని అడిగారు. తమ చిన్నారికి వైద్యసాయం అందించాలని వాళ్లు కోరారు. దీంతో అక్కడే ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్‌ను పిలిచి చిన్నారి వైద్యానికి సాయం అందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఆ కుటుంబానికి రూ. 3 వేలు పెన్షన్ వస్తుందని తెలుసుకున్నారు. వచ్చే నెల నుంచి వీరి కుటుంబానికి రూ. 10వేల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలని.. అలాగే చిన్నారి వైద్యానికి ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా చికిత్స చేయించాలని ఆదేశించారు. వైఎస్ జగన్ చేసిన సాయానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కూడా వైఎస్ జగన్ మానవత్వాన్ని చూపించారు. కోనసీమ పర్యటనలో హనీ అనే చిన్నారి పరిస్థితిని తెలుసుకొని, వైద్యానికి భారీ సాయం అందించారు.
పెద్ద మనసు చాటుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. చిన్నారి వైద్యానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు. pic.twitter.com/vTn1wgf1aM
— Jσԋɳ Kσɾα (@yuvatv) November 24, 2022