Telugu Global
Andhra Pradesh

8 నెలల ముందే.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైఎస్ జగన్

ఇకవై ఆ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పార్టీ పరంగా అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు.

8 నెలల ముందే.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైఎస్ జగన్
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. అదేంటి.. ఇప్పుడు అలాంటి ఎన్నికలు ఏమీ లేవు కదా.. అభ్యర్థులను ఖరారు చేయడం ఏంటిని అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది మార్చిలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏనాడూ పోటీ చేయలేదు. బరిలోకి దిగిన స్వతంత్ర, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. లేదా ఆ ఎన్నికలకు పూర్తిగా దూరం ఉంటూ వచ్చింది. కానీ ఇకవై ఆ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పార్టీ పరంగా అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. వారి సూచనలు, సలహాలు తీసుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉన్నా ముందుగానే పేర్లను ఖరారు చేయడం గమనార్హం.

ఉమ్మడి విశాఖపట్నం-శ్రీకాకుళం-విజయనగరం జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలు జిల్లాల నియోజకవర్గానికి వెన్నపూస రవీంద్రరెడ్డి, చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్లను నిర్ణయించారు. ముందుగానే అభ్యర్థులకు ఖరారు చేసినందున.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలని జగన్ సూచించారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా కార్యాచరణను సిద్ధం చేయడానికి నలుగురు ఎమ్మెల్యేలకు బాధ్య‌తలు అప్పగించినట్లు తెలిసింది. పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే విషయాలను ఆ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. ఇప్పటి నుంచే గ్రాడ్యుయేట్ల ఓటరు జాబితా ప్రకారం బలాబలాలు చూసుకోవాలని.. అందుకు పార్టీ నుంచి సహకారం లభిస్తుందని అభ్యర్థులకు తెలిపినట్లు సమాచారం.

కాగా, అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ చేసే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. అక్కడ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని.. ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ప్రకటిద్దామని జగన్ చెప్పినట్లు తెలిసింది. బలాబలాలు తెలిసిన తర్వాత సరైన అభ్యర్థినే నిలబెట్టి పోటీ చేద్దామని జగన్ వివరించినట్లు సమాచారం.

First Published:  19 July 2022 10:42 AM IST
Next Story