Telugu Global
Andhra Pradesh

'జగనన్నకు చెబుదాం'.. ఏపీలో కొత్త కార్యక్రమం

అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందితే వాటిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్ చెప్పారు.

జగనన్నకు చెబుదాం.. ఏపీలో కొత్త కార్యక్రమం
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ త్వరలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకొని, వాటికి తక్షణమే పరిష్కారాన్ని చూసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 'జగనన్నకు చెబుదాం' అనే పేరుతో ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని, అంతే కాకుండా సీఎంవోతో సహా అన్ని శాఖల్లో పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఈ కొత్త కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో ఆయన అధికారులకు వివరించమే కాకుండా, గ్రీవెన్స్‌లో వచ్చే ప్రతీ అభ్యర్థన, ఫిర్యాదు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఫాలో చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ దరఖాస్తును పూర్తిగా పరిశీలించాలని, అంతే కాకుండా దీనికి సంబంధించి వీక్లీ ఆడిట్ కూడా నిర్వహించాలని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.

ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ కాల్ సెంటర్లను ఈ కార్యక్రమంతో లింక్ చేయాలని సీఎం జగన్ చెప్పారు. అక్కడకు వచ్చే అభ్యర్థనలు, ఫిర్యాదులను కూడా సంబంధిత శాఖలకు బదిలీ చేయాలని సూచించారు. అధికారులు వచ్చిన అభ్యర్థనలను పునపరిశీలించి.. ఇప్పటికే ఉన్న పద్దతుల్లో పరిష్కారం అందించాలని చెప్పారు. సీఎంవోతో పాటు ప్రతీ శాఖలో 'జగనన్నకు చెబుదాం' ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్ ఉండాలని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ ప్రతీ జిల్లా, మండలం, మున్సిపల్, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

ఇప్పటికే అమలులో ఉన్న స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగానే జగనన్నకు చెబుదాంను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, హోం, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉందని.. ప్రస్తుతం స్పందనలో కూడా వాటికి సంబంధించిన అభ్యర్థనలే వస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రతీ కంప్లైట్‌ను త్వరగా పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, అవసరం అయితే వారికి శిక్షణ కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు.

ఫిర్యాదు/అభ్యర్థన చేసిన ప్రతీ వ్యక్తి నుంచి.. సమస్య పరిష్కారం అయ్యాక ఒక లేఖ కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అందితే వాటిపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా జగన్ చెప్పారు. మండలం, మున్సిపల్ స్థాయిలో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేస్తామని.. అందులో పోలీస్, రెవెన్యూ, పంచాయితిరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు ఉంటారని సీఎం అన్నారు. ప్రతీ వారం ఈ కమిటీ జగనన్నకు చెబుదాంలో వచ్చే అభ్యర్థనలకు సంబంధించిన ఆడిట్ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

First Published:  4 Feb 2023 7:33 AM IST
Next Story