Telugu Global
Andhra Pradesh

తెలుగోడి జెండా.. భారతీయుల గుండె

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాలనలో అనేక సంస్కరణలను అమలు చేశామని చెప్పారు జగన్. అనేక వర్గాలను దోపిడీ నుంచి కాపాడామన్నారు.

తెలుగోడి జెండా.. భారతీయుల గుండె
X

భారత జాతీయ జెండా ప్రజలందరి స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని అన్నారు ఏపీ సీఎం జగన్‌. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల గుండెగా మారిందని చెప్పారు జగన్. భారత స్వాతంత్ర పోరాటం మహోన్నతమైనదని, ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఆహార ధాన్యాల లోటుని అధిగమించి ఇప్పుడు 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు జగన్. ప్రపంచ ఫార్మా రంగంలో భారత్ మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచంతో పోటీపడి గణనీయంగా అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు జగన్.

వాదం ఏదయినా గమ్యం ఒక్కటే..

స్వాతంత్ర పోరాటంలో అతివాదం, మితవాదం, విప్లవ వాదం.. ఇలా మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు జగన్. అహింసే ఆయుధంగా.. సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం భారత దేశానికే కాకుండా ప్రపంచ మానవాళికి తిరుగులేని స్ఫూర్తిగా, మహోన్నత చరిత్రగా నిలిచిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాలనలో అనేక సంస్కరణలను అమలు చేశామని చెప్పారు జగన్. అనేక వర్గాలను దోపిడీ నుంచి కాపాడామన్నారు.

మూడేళ్ల పాలనలో విజయాలివి..

వైసీపీ మూడేళ్ల పాలనలో అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చామని, పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చామని, ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకి పింఛన్‌ పంపిస్తున్నామని చెప్పారు జగన్. విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయని, అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు జగన్. రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని, అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించామని, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ.. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశామన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతూల్యత అవసరం అని చెప్పారు జగన్.

First Published:  15 Aug 2022 11:34 AM IST
Next Story