బీజేపీతో సంబంధాలపై జగన్ కీలక వ్యాఖ్యలు
జగన్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఒక బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. కానీ తాను నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమేనన్నారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన బలం ప్రజలేనన్నారు.
బీజేపీతో సంబంధాలపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన జగన్‌మోహన్ రెడ్డి తాను నమ్ముకున్నది ప్రజలను మాత్రమేనన్నారు.
పేద విద్యార్థులు మంచిగా చదువుతుంటే చూసి తట్టుకోలేని బుద్ది చంద్రబాబుది అని సీఎం విమర్శించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం కాబట్టే పేదల చదువులకూ అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతుకే మోసం, ఒక పెద్ద అబద్దమని సీఎం ఫైర్ అయ్యారు. చంద్రబాబు పేదలకు వ్యతిరేకం అన్న విషయాన్నీ ఎవరూ మరిచిపోకూడదన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు.
మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్క రాష్ట్రాల నుంచి మేనిఫెస్టోలు కాపీ కొట్టి, ఇక్కడ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కలిపి కొత్త రకం పులిహోర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడొచ్చి రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారని.. 14ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం గాడిదలు కాశారని ప్రశ్నించారు.
14ఏళ్లు ఏమీ చేయకపోగా ఇప్పుడు వచ్చి ఇంటికి కేజీ బంగారం ఇస్తాం.. ఇంటికో బెంజ్ కారు ఇస్తా అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లు మాత్రమేనన్నారు. ఇదే చంద్రబాబు సైకిల్ చక్రం అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం అన్నారు. టీడీపీ స్కాంలకు, వైసీపీ స్కీంలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. టీడీపీ డీపీటీ కావాలో.. ఈ ప్రభుత్వ డీబీటీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
జగన్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఒక బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. కానీ తాను నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమేనన్నారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన బలం ప్రజలేనన్నారు.
ప్రపంచాన్ని ఏలే స్థితిలో మన విద్యార్థులుండాలన్నారు సీఎం జగన్. విద్యార్థులు టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం కోసం అమెరికా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని గుర్తు చేశారు. మన బడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశామన్నారు. ఈ ఏడాది మీ జగన్ మామయ్య పుట్టిన రోజున 8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు అందజేస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. రోజుకోక మెనూతో ఆహారం అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 15వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానాన్ని అమలు చేస్తామన్నారు. నాలుగేళ్లలో విద్యార్థుల చదువు కోసం ఏర్పాటు చేసిన పథకాల కోసం రూ. 60వేల 329 కోట్లు ఖర్చు చేశామన్నారు.
జగనన్న విద్యాకానుక ద్వారా మూడు జతల యూనిఫాం, జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, బెల్ట్, నోట్ బుక్స్, వర్క్‌బుక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, బ్యాగ్‌ను అందజేస్తారు. 43.10 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు విద్యాకానుక అందుకోనున్నారు. ఇందుకోసం 1042 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.