నేటితో జగన్ బస్సు యాత్ర ముగింపు.. రేపు నామినేషన్
సభా ప్రాంగణం నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న జగన్.. గన్నవరం బయల్దేరుతారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు.
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా అక్కిలవలస నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా సాగనుంది. సాయంత్రం టెక్కలిలో నిర్వహించే భారీ బహిరంగసభలో సీఎం జగన్ పాల్గొంటారు. మొత్తం 22 రోజుల పాటు కొనసాగిన బస్సు యాత్ర ఈ సభతో ముగియనుంది.
తర్వాత సభా ప్రాంగణం నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న జగన్.. గన్నవరం బయల్దేరుతారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు. ఇక గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు జగన్.
ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉండడంతో.. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 26 లేదా 27 నుంచి ఈ బహిరంగ సభలు ఉంటాయని సమాచారం.