Telugu Global
Andhra Pradesh

నిధుల కోసం ప్రధాని మోడీని కలువనున్న సీఎం జగన్

ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో సరిపడనంత నిధులు లేనందున ఈ విషయాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకొని వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రానికి రావల్సిన పన్నుల వాటాను వెంటనే విడుదల చేయాలని కూడా కోరనున్నారు.

నిధుల కోసం ప్రధాని మోడీని కలువనున్న సీఎం జగన్
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో.. కేంద్రం సాయం కోరేందుకు ఆయన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలవడానికి సిద్ధ‌పడుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. కోవిడ్ కారణంగా ఆశించిన మేరకు ఆదాయం రాలేదు. అదే సమయంలో ప్రకృతి వైపరిత్యాల కారణంగా రాష్ట్రం భారీగా నష్టపోయింది. బయట నుంచి అప్పులు చేద్దామన్నా ఎఫ్ఆర్బీఎం ఆంక్షల కారణంగా కుదరడం లేదు. దీంతో రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఏర్పడింది.

గోదావరి వరదల కారణంగా అంబేద్కర్ కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రజలకు పునరావాసం కల్పించాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు పోలవరం నిర్వాసితులకు ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సాయం చేయాల్సి ఉంది. వీటికి భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్ జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో ఉద్యోగుల జీతాలు, సామాజిక, ప్రభుత్వ పెన్షన్ల చెల్లింపునకు నిధుల లభ్యతపై ఆరా తీశారు.

ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో సరిపడనంత నిధులు లేనందున ఈ విషయాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకొని వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రానికి రావల్సిన పన్నుల వాటాను వెంటనే విడుదల చేయాలని కూడా కోరనున్నారు. పోలవరం ప్యాకేజీకి సంబంధించిన నిధులతో పాటు, తెలంగాణ నుంచి రావల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని సీఎం జగన్ కోరనున్నారు. ఈ పర్యటనలో పోలవరం సవరించిన అంచనాలను ఆమోదింప చేసుకోవాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం అధికారులు గోదావరి వరదల నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. అది పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను కేంద్రానికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని గత కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నది. అప్పుల నుంచి ఉపశమనం పొంది, వడ్డీలు కట్టాలంటే కొత్త అప్పులు చేయడమే తాత్కాలిక పరిష్కారం అని సీఎంకు సమీక్షలో సూచించారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచాలని, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ నిధులను పెంచాలని కూడా సీఎం కోరనున్నట్లు తెలుస్తున్నది. ఇంకా పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ రూపొందనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  29 July 2022 8:05 AM IST
Next Story