కేంద్ర సాయం, రాష్ట్ర సాయం రెండూ అందిస్తాం
ముంపు బాధితుల్లో ఒక్కరు కూడా మిగిలిపోకుండా సాయం అందిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. బాధితులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
ప్రజలకు న్యాయం చేయడమే తమ సంకల్పమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ సోమవారం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.
సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం.. మూడు ఫేజ్‌లలో పోలవరం డ్యామ్‌లో నీరు నింపుతామని జగన్ చెప్పారు. ఒక్కసారిగా డ్యామ్‌లో నీటిని నింపితే డ్యామ్ కూలిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రకారం తమ ప్రభుత్వం ముందుకెళుతోందని వివరించారు. పోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించడం లేదని ఈ సందర్భంగా జగన్ చెప్పారు.
ముంపు బాధితుల్లో ఒక్కరు కూడా మిగిలిపోకుండా సాయం అందిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. బాధితులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. పోలవరం పరిహారం కేంద్రం చెల్లించినా పర్లేదని జగన్ తెలిపారు. పునరావాస ప్యాకేజీకి కేంద్రం త్వరలోనే ఆమోదం తెలుపుతుందని సీఎం వివరించారు. బాధితులకు రావాల్సిన ప్యాకేజీపై తప్పకుండా మంచి జరుగుతుందని, ప్రతి నిర్వాసిత కుటుంబానికీ న్యాయమైన ప్యాకేజీ అందుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కేంద్రం ఇచ్చే పునరావాస ప్యాకేజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ సొమ్ము అందిస్తామని వివరించారు.