Telugu Global
Andhra Pradesh

సాయంత్రం ఢిల్లీకి జగన్.. సడన్ టూర్ కి కారణం ఏంటి..?

వినతి పత్రాలు ఇచ్చేందుకే అయితే ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చాలామందే ఉన్నారు. పోనీ ప్రతిసారీ ఏపీ నుంచి వస్తున్న వినతులని క్రమం తప్పకుండా కేంద్రం కనికరిస్తుందా అంటే అదీ లేదు.

సాయంత్రం ఢిల్లీకి జగన్.. సడన్ టూర్ కి కారణం ఏంటి..?
X

ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రేపటి నుంచి బడ్జెట్ పై చర్చ ఉంటుంది. అయితే సడన్ గా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారనే వార్త బయటకొచ్చింది. ఆ తర్వాత అధికారికంగా దాన్ని ధృవీకరించారు కూడా. ఇంత టైట్ షెడ్యూల్ లో సడన్ గా జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణం ఏంటి..?

ఈ సాయంత్రం ఏపీ నుంచి బయలుదేరి రాత్రి 7.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు జగన్. అక్కడ 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేస్తారు. రేపు ఆయనకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఉందని తెలుస్తోంది. వారిద్దరినీ ఆయన విడివిడిగా కలుస్తారు. జగన్ ఢిల్లీ పర్యటన అంటే.. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ బకాయిలపై వినతిపత్రాలు ఇస్తారనేది ఎప్పటికీ మార్పులేని జవాబు. ఈసారి కూడా రాష్ట్ర సమస్యలు, పెండింగ్ బకాయిలపై సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షా కి వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖ పాలన అనే అంశం జత చేరింది. విశాఖనుంచి పాలన మొదలు పెడతామనే విషయాన్ని జగన్, మోదీకి వివరిస్తారని అంటున్నారు. సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ కావడం మాత్రం ఏపీ రాజకీయా వర్గాల్లో చర్చకు తావిచ్చింది.

వినతి పత్రాలు ఇచ్చేందుకే అయితే ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చాలామందే ఉన్నారు. పోనీ ప్రతిసారీ ఏపీనుంచి వస్తున్న వినతులని క్రమం తప్పకుండా కేంద్రం కనికరిస్తుందా అంటే అదీ లేదు. ప్రభుత్వాలు మారినా ఏపీ విషయంలో, విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రం మొండి వైఖరితోనే ఉంది.

టీడీపీ కౌంటర్లు..

జగన్ ఢిల్లీ టూర్ ఖరారైందో లేదో అప్పుడే టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలపై సీబీఐ విచారణ జరుపుతోంది. జగన్ పర్యటనకు, ఈ కేసు విచారణకు లింకు పెడుతూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకుని లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.

First Published:  16 March 2023 12:48 PM IST
Next Story