Telugu Global
Andhra Pradesh

పాడిపంటలు కావాలా..? నక్కలు, తోడేళ్లు కావాలా..?

కరువు వచ్చినా పరిహారం ఇవ్వని చంద్రబాబు, తాము చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారని, బాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు జగన్.

పాడిపంటలు కావాలా..? నక్కలు, తోడేళ్లు కావాలా..?
X

"పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా? రైతుకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా? పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా? ఏ ప్రభుత్వం కావాలో మీరే ఆలోచించుకోండి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు..? చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది..? రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త.." అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు ఏపీ సీఎం జగన్. నైతికత లేని వ్యక్తి చంద్రబాబు అని, వారిలా తనకు అబద్ధాలు చెప్పడం రాదన్నారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. రైతుల ఖాతాల్లో బీమా పరిహారం జమ చేశారు. 1117 కోట్ల రూపాయలను 10.2 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు.


ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు 3411 కోట్ల రూపాయల బీమా పరిహారం చెల్లిస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రూ.7,802 కోట్లు చెల్లించామని చెప్పారు సీఎం జగన్. ఏపీలో ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టామని అన్నారు. మూడు విడతల్లో రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర మంది రైతులకు రూ.30,985 కోట్లు రైతు భరోసా ఇచ్చామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందిస్తున్నామని అన్నారు జగన్.

కరువు వచ్చినా పరిహారం ఇవ్వని చంద్రబాబు, తాము చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారని, బాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు కరువును పారద్రోలాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిస్సిగ్గుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

పంట నష్టం జరిగితే సీజన్ ముగిసిపోకముందే పరిహారం అందిస్తున్న ప్రభుత్వం తమది అని గుర్తు చేశారు జగన్. సున్నా వడ్డీకి రైతు రుణాలు, రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌, చుక్కల భూమి సమస్యలకు పరిష్కారం, పశువులకోసం 304 అంబులెన్స్ లు, పాడిరైతులకు ఆదాయం పెంచేందుకు అమూల్ ని తీసుకొచ్చామని రైతు దినోత్సవ సభలో వివరించారు సీఎం జగన్.

First Published:  8 July 2023 4:44 PM IST
Next Story