వెంటిలేటర్ పై చంద్రబాబు, టీడీపీ..
ప్రస్తుతం చంద్రబాబు వెంటిలేటర్ పై ఉన్నారని, టీడీపీ పరిస్థితి కూడా వెంటిలేటరేనని సెటైర్లు పేల్చారు సీఎం జగన్. టీడీపీని నలుగురు కలిపి లేపాల్సిన పరిస్థితి ఉందన్నారు.
దేవుడ్ని, ప్రజల్ని, వారికి చేసిన మంచినే తాను నమ్ముకున్నానని చెప్పారు సీఎం జగన్. ప్రతిపక్షాలు పొత్తుల్ని, ఎత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని నమ్ముకున్నాయని ఎద్దేవా చేశారు. పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదన్నారాయన. కానీ బాబు పేరు చెప్పగానే అందరికీ వెన్నుపోటు ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు జగన్.
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యాకార భరోసా పంపిణీ చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. చంద్రబాబుపై చెణుకులు విసిరారు. ప్రస్తుతం చంద్రబాబు వెంటిలేటర్ పై ఉన్నారని, టీడీపీ పరిస్థితి కూడా వెంటిలేటరేనని సెటైర్లు పేల్చారు.
టీడీపీని నలుగురు కలిపి లేపాల్సిన పరిస్థితి ఉందన్నారు. టీడీపీ చక్రం తిప్పుతుందని వారి అనుకూల మీడియాలో చెబుతారని, అక్కడెక్కడో కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే దానికి కారణం చంద్రబాబు అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు సీఎం జగన్. పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారన్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తొస్తారన్నారు. తాను మంచిని నమ్ముకున్నానని, ప్రజల్ని నమ్ముకున్నానని చెప్పారు.
గత ప్రభుత్వం మత్స్యకారులకు అరకొర సాయం అందించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు మాత్రమే సాయమందించారని.. మొత్తంగా వారి హయాంలో ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మత్య్సకారులకు ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇచ్చిందని అన్నారు జగన్. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు సూచించారు జగన్.
గడప గడపకు మీ బిడ్డ తరపున ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వస్తున్నారని, మంచిని వివరిస్తున్నారని.. ఆ మంచి జరిగిందని మీరు నమ్మితే మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం జగన్.