బాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే..
మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడన్నారు జగన్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే అన్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించేవి అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపే అన్నారు.
మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తే..
చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారన్నారు సీఎం జగన్. కానీ తాము అలా కాదన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించామన్నారు. అందుకే 99 శాతం అమలు చేశామన్నారు. 2 లక్షల 70వేల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశామన్నారు. 58 నెలల కాలంలోనే 2 లక్షల 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎక్కడా లంచాలకు, వివక్షకు తావు లేదన్నారు. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండన్నారు జగన్.
బాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమైనా ఉందా?
మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడన్నారు జగన్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా? అని ప్రశ్నించారు. "ఇదే కూటమి గతంలో మిమ్మల్ని మోసం చేసింది నిజం కాదా?. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు." అసలు ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్.