Telugu Global
Andhra Pradesh

ఏపీలో సోషల్ మీడియా వేధింపులకు కళ్లెం

సోషల్‌ మీడియా ద్వారా జరిగే వేధింపులకు అడ్డుకట్ట పడాలన్న సీఎం జగన్, దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఏపీలో సోషల్ మీడియా వేధింపులకు కళ్లెం
X

సోషల్ మీడియా వేధింపులపై చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. అయితే వీటి విచారణ, నేరస్థులను పట్టుకోవడం సమస్యగా మారింది. ఇలాంటి కేసుల విచారణకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ సర్కారు. ఈమేరకు హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోషల్‌ మీడియా ద్వారా జరిగే వేధింపులకు అడ్డుకట్ట పడాలన్న ఆయన, దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

మహిళా పోలీస్ ల సంగతేంటి..?

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్ పోస్ట్ లను ప్రభుత్వం భర్తీ చేసింది. వారికి కూడా పోలీస్ యూనిఫామ్ ఇచ్చి, సాధారణ పోలీసుల విధులు కేటాయించాలనుకుంది. కానీ కోర్టు కేసులతో ఆ వ్యవహారం వాయిదా పడింది. అయితే ఇప్పుడు హోంశాఖ రివ్యూలో సీఎం జగన్, సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలని స్పష్టం చేశారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని అధికారులకు సూచించారు. వారి విధులలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

మాదకద్రవ్యాల కట్టడికోసం..

ఏపీలోనే కాదు, దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇటీవల డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పల్లెటూళ్లకు కూడా గంజాయి గుట్టుగా సరఫరా అవుతోంది. ఏపీలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు సీఎం జగన్. రవాణా, పంపిణీ, వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్‌ పెడలర్స్‌ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలన్నారు.

ఇకపై ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక దిశ పోలీస్‌స్టేషన్‌ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. దిశ యాప్‌ మీద మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంట్లో దిశ యాప్ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారా? లేదా? అని పరిశీలన చేయాలన్నారు. దిశ యాప్‌ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు జగన్.

First Published:  4 May 2023 3:39 PM IST
Next Story