ఏపీ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు.. ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ లు
మనం స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, నేషనల్ సిలబస్ అనే అంశాల వద్దే ఆగిపోయామని.. ప్రపంచం ఇప్పుడు ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) వైపు వెళ్తోందని దాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నారు సీఎం జగన్.
ఏపీ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఉన్నత విద్యలో కూడా కీలక మార్పులు చేసేందుకు ఆయన ప్రయత్నం మొదలు పెట్టారు. ఇకపై డిగ్రీ సహా ఇతర కోర్సుల్లో ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ లు రాబోతున్నాయి. బీకామ్ లో కేవలం ఫైనాన్స్ మాత్రమే కాకుండా.. ఇకపై రిస్క్ మేనేజ్ మెంట్, అసెట్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, ఫైనాన్స్ మేనేజ్ మెంట్ వంటి అనేక వర్టికల్స్ ని కరికులమ్ లో భాగం చేయాలంటున్నారు జగన్. విదేశీ విద్యకు మనకు తేడా అక్కడే ఉందని చెప్పారు. అక్కడ వివిధ రకాల వర్టికల్స్ అందుబాటులో ఉన్నాయని, అందుకే మన విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారని వివరించారు.
ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌పై క్యాంపు కార్యాలయంలో హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమావేశమైన సీఎం శ్రీ వైయస్.జగన్. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాఖ సంస్ధల ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్.జగన్ కీలక సమావేశం. pic.twitter.com/OHNwiFEI5z
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 20, 2023
ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ అధికారులతోపాటు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి సంస్ధల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విద్యారంగంలో కీలక మార్పులపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే సమావేశం నాటికి మార్పులతో సిద్ధంగా ఉండాలని, వాటిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇంకా మనం స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, నేషనల్ సిలబస్ అనే అంశాల వద్దే ఆగిపోయామని.. ప్రపంచం ఇప్పుడు ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) వైపు వెళ్తోందని దాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నారు. అలా చేసినప్పుడే విదేశాల్లోని విద్యార్థులతో మన పిల్లలు పోటీపడగలుగుతారని చెప్పారు సీఎం జగన్. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధి.. ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక రూపకల్పన చేయాలన్నారు.. బోధనలో, శిక్షణలో ఫ్యూచర్ టెక్నాలజీ వినియోగంపై కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు.
భారత్ లో ఏఐ వంటి వర్టికల్స్ అభివద్ధి చాలా తక్కువగా ఉందని, వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువుగా ఉందని, వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. వర్చువల్ రియాలిటీ, అగ్ మెంటెడ్ రియాలటీ వంటి అంశాలు కరికులమ్‌లో చేర్చాలన్నారు. ఇది కేవలం ఒక సంస్ధకే పరిమితం కాకుండా… పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో ఈ కరికులమ్ ని తీసుకురావాలని చెప్పారు. ఒక తరంలో వీటిని మనం నేర్పించగలిగితే.. ఆయా వర్టికల్స్ లో మనం నిపుణులను తయారుచేయగలుగుతామని తెలిపారు జగన్. తమ ప్రభుత్వం మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతోందని, విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐబీతో కలిసి ఒక కొత్త సిలబస్ రూపొందించబోతున్నామని, అది దేశానికే బెంచ్ మార్క్ అవుతుందని చెప్పారు సీఎం జగన్.