ఒకేరోజు రూ.6,600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
ఒకవైపు ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు.
ఏపీలో ఒకేరోజు రూ.6,600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా చేపట్టారు. కడపలో 750 మెగావాట్ల సామర్థ్యం, అనంతపురంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్.. వీటితో పాటు 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతూ ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రూ.620 కోట్లతో 12 సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నామని, రూ.2,479 కోట్లతో మరో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు.
దీంతోపాటు రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.49లకే యూనిట్ ధరతో సోలార్ పవర్‌ను ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడిందని సీఎం చెప్పారు. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే.. మరో 25 సంవత్సరాలపాటు రూ.2.49లకే అందుబాటులో ఉండేలా రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. రెండోవైపు మరో రూ. 3,400 కోట్లతో దాదాపుగా 850 మెగావాట్ల సోలార్ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు. నేడు వాటికి కూడా శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. వీటిన్నింటి కోసం దాదాపుగా రూ.6,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నామన్నారు.