ఇకనుంచి ఇదే స్టీల్ సిటీ –జగన్
దేవుడి దయవల్ల ఈరోజు JSW స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూమిపూజ చేసుకున్నామని చెప్పారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దీన్ని ఒక చిన్న కార్యక్రమంలా చేస్తున్నామని అన్నారు.
కడప జిల్లా సున్నపురాళ్ల పల్లెలో JSW స్టీల్ ప్లాంట్ కి సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ తో ఈ ప్రాంతం స్టీల్ సిటీగా మారిపోతుందని, కడప జిల్లాతో పాటు ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని అన్నారాయన. గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కలలు కన్నారని, అనాడు స్టీల్ ప్లాంట్ కోసం ఆయన పరితపించారని గుర్తు చేశారు.
ఆయన స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. దేవుడి దయవల్ల ఈరోజు JSW స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూమిపూజ చేసుకున్నామని చెప్పారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దీన్ని ఒక చిన్న కార్యక్రమంలా చేస్తున్నామని అన్నారు.
మూడు దశల్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని.. మూడేళ్లలో 3300 కోట్ల రూపాయల పెట్టుబడితో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో మొదటి దశ, ఐదేళ్లలో మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకుంటుందని తెలిపారు సీఎం జగన్. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డామని ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. రూ.4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి, రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యాన్యు ఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్థానికులకు 74 శాతం ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులకు ఏపీ అనుకూల రాష్ట్రంగా నిలిచిందని, దేశ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారన చెప్పారు జగన్.
మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందాల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్ తో చాలా కాలం నుంచి పరిచయం ఉందని, వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందాల్ భూమిపూజ కార్యక్రమంలో తెలిపారు.