Telugu Global
Andhra Pradesh

దేశం మొత్తం ఆడిట్ జరగాల్సిందే.. రైలు ప్రమాదంపై జగన్ ఆసక్తికర ట్వీట్

దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఈ ఆడిట్ జరగాల్సి ఉందన్నారు సీఎం జగన్. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలని, ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన ట్వీట్ చేశారు.

దేశం మొత్తం ఆడిట్ జరగాల్సిందే.. రైలు ప్రమాదంపై జగన్ ఆసక్తికర ట్వీట్
X

విజయనగరం జిల్లా కంటాకపల్లి రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు, ట్విట్టర్లో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అసలు సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ట్వీట్ చేశారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ప్రశ్నించిన ఆయన, దీనిపై ఉన్నతస్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరారు. దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఈ ఆడిట్ జరగాల్సి ఉందన్నారు జగన్. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూడాలని, ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన ట్వీట్ చేశారు.


బాధితులకు పరామర్శ..

రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది మృతిచెందగా.. తీవ్రగాయాలపాలై వందమందికి పైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సీఎం జగన్ క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆస్పత్రి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న సీఎం జగన్.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. బాధితుల్ని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన ఏపీ వాసుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహాన్ని అందిస్తామని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్. ఈ పరిహారాన్ని సత్వరమే వారికి అందించాలని చెప్పారు.


First Published:  30 Oct 2023 6:52 PM IST
Next Story