మొహమాటం వద్దు.. ఏపీ పోలీసులకు సీఎం జగన్ కీలక సూచన
నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ని చంపిన ఘటనను సీఎం జగన్ గుర్తు చేశారు. దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు జగన్.
విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, సాంకేతికతకు తగ్గట్లు అప్ డేట్ కావాలని సూచించారు ఏపీ సీఎం జగన్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన విధి నిర్వహణ విషయంలో పోలీసులకు పలు కీలక సూచనలు చేశారు. అసాంఘిక శక్తులు చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయని, అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలని చెప్పారు. దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్నారు. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకపోతే సమాజంలో రక్షణ ఉండదన్నారు సీఎం జగన్.
నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ని చంపిన ఘటనను సీఎం జగన్ గుర్తు చేశారు. అంగళ్లులో ప్రతిపక్ష నాయకుడు తన పార్టీవారిని రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించారని, పుంగనూరులో 40మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, ఓ పోలీస్ కంటిచూపు కోల్పోయారని చెప్పారు. చివరకు న్యాయమూర్తులపైనా ట్రోలింగ్ చేస్తున్నారని, తమ సొంత ఛానెళ్లలో చర్చల పేరుతో అవమానించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు జగన్.
పోలీస్ సంక్షేమం కోసం..
ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు సీఎం జగన్. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్, ఓ బాధ్యత అని చెప్పిన జగన్.. పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని చెప్పారు జగన్.
♦