Telugu Global
Andhra Pradesh

సాయంత్రం ఢిల్లీకి జగన్.. ప్రతిపక్షాల విమర్శలకు పదును

సాయంత్రం ఢిల్లీ టూర్ పెట్టుకున్నా కూడా ఈరోజంతా సీఎం జగన్ బిజీబిజీగా గడపబోతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా చేదోడు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

సాయంత్రం ఢిల్లీకి జగన్.. ప్రతిపక్షాల విమర్శలకు పదును
X

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరంలో విమానం ఎక్కుతారు జగన్. సాయంత్రం 6.45 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ఈరోజు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని మంగళవారం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హోటల్ లో దౌత్యవేత్తలతో జరగబోయే ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జగన్ పాల్గొంటారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఈరోజంతా బిజీ బిజీ..

సాయంత్రం ఢిల్లీ టూర్ పెట్టుకున్నా కూడా ఈరోజంతా సీఎం జగన్ బిజీబిజీగా గడపబోతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వేదికగా చేదోడు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఉదయం 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్‌.

ప్రతిపక్షాల విమర్శలు..

జగన్ వెళ్తోంది అధికారిక కార్యక్రమమే అయినా.. ప్రతిపక్షాలు మాత్రం ఈ టూర్ ని వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు ముడిపెట్టి విమర్శిస్తున్నాయి. అవినాష్ రెడ్డిని ఆ కేసు నుంచి రక్షించేందుకే జగన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. గతంలో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలే చేశారు. గత ఢిల్లీ పర్యటనలో కూడా జగన్ అవినాష్ ని కాపాడేందుకే కేంద్ర పెద్దల్ని కలిశారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఆరోపణలు సంధించింది.

First Published:  30 Jan 2023 7:19 AM IST
Next Story