Telugu Global
Andhra Pradesh

నీ సభలకు జనం ఎందుకొస్తారు బాబు..?

రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచినందుకు చంద్రబాబు సభలకు జనం వస్తారా?, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినందుకు జనం వస్తారా?,

నీ సభలకు జనం ఎందుకొస్తారు బాబు..?
X

మరోసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. దత్తతండ్రి అయిన చంద్రబాబును దత్తపుత్రుడు నెత్తినపెట్టుకుని ఊరేగుతున్నాడని జగన్ ఫైర్ అయ్యారు.

ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ, ఈ భార్య కాకపోతే మరో భార్య అన్నట్టుగా చంద్రబాబు, దత్తపుత్రుడు సిద్ధాంతం ఉందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వీరిద్దరిని చూసినప్పుడే ఈ రాష్ట్రానికి ఇదేం ఖర్మరా బాబు అనిపిస్తుందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లవుతున్న ఈ దత్తపుత్రుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని జగన్ ఎద్దేవా చేశారు. ఈ దత్తపుత్రుడికి నిర్మాత, డైరెక్టర్ అన్నీ చంద్రబాబే అని విమర్శించారు.

సింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది తానే అని చెప్పుకుంటాడు కానీ కుప్పంలో మాత్రం తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారని చంద్రబాబును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది కేవలం రెండే పథకాలని అందులో ఒకటి వెన్నుపోటు, రెండు మోసం అని విమర్శించారు.

మోసాల బాబు మీటింగ్ కు జనం భారీగా వస్తున్నారని నమ్మించేందుకు ఎల్లో మీడియా, టిడిపి విపరీతంగా ప్రయత్నిస్తున్నాయని సీఎం విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచినందుకు చంద్రబాబు సభలకు జనం వస్తారా?, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినందుకు జనం వస్తారా?, పొదుపు సంఘాలను నాశనం చేసినందుకు మహిళలు చంద్రబాబు సభకు వస్తారా?, ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజ్ కోసం తాకట్టు పెట్టినందుకు జనం వస్తారా?, ఇంటికో ఉద్యోగం ఇస్తా... ఉద్యోగం ఇవ్వలేకపోతే ఒక్కో నిరుద్యోగికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు నిరుద్యోగులు చంద్రబాబు సభలకు వస్తారా? అని జగన్ ప్రశ్నించారు.

జన్మభూమి కమిటీల పేరుతో రక్తం పీల్చుకు తాగినందుకు చంద్రబాబు కోసం ఇప్పుడు ప్రజలు వస్తారా?, ఉచితంగా విద్య అందిస్తానని ఎన్నికల ముందు చెప్పి మోసం చేసినందుకు చంద్రబాబు సభలకు జనం వస్తారా? అని నిలదీశారు. ''దత్తపుత్ర ఈ పాపంలో నీకు కూడా వాటా ఉంది కాబట్టి నీకు కూడా థాంక్యూ చెప్పడానికి ఎవరైనా నీ సభలకు వస్తారా?'' అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వంచకులను, దుర్మార్గులను చూడ్డానికి వారి మీటింగులకు ఎవరు వస్తారని ఫైర్ అయ్యారు,

చంద్రబాబు, దత్తపుత్రుడు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రజలు చిత్తుగా ఓడిస్తారని సీఎం ప్రశ్నించారు, సొంత పుత్రుడినే కాకుండా దత్తపుత్రుడని కూడా ప్రజలు చిత్తుగా ఓడించార‌ని గుర్తు చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు, రామోజీ ,రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, వీరంతా కలిసి దోచుకో, పంచుకో, తినుకో అనే కార్య‌క్ర‌మాన్ని న‌డిపార‌ని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఇల్లు కావాలన్నా, లోన్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా, చివరకు మరుగుదొడ్డి నిర్మాణానికి కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని అలాంటి వ్యక్తి మీటింగ్‌లకు జనం ఎందుకు వస్తారని సీఎం ప్రశ్నించారు. రాజకీయాలంటే డైలాగులు, డ్రోన్‌ కెమెరాలు, షూటింగులు కాదు అని ముఖ్యమంత్రి వివరించారు. రాజకీయమంటే పేదలకు ఇల్లు ఇవ్వడం, మధ్యతరగతి కుటుంబాల్లో మార్పులు తీసుకురావడం అని సీఎం వ్యాఖ్యానించారు.

సభకు జనం రాకపోయినా బాగా వచ్చారని చూపించడానికి ఒక ఇరుకు రోడ్డులోకి జనాన్ని తీసుకెళ్లి ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు అని జగన్ ఫైర్ అయ్యారు. కేవలం డ్రోన్ కెమెరా ఫొటోల కోసం చంద్రబాబు ఇంత‌ దారుణానికి ఒడిగట్టారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ కోసం ఒక దర్శకుడి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో షూట్ చేయబోయి గోదావరి పుష్కరాల్లోనూ 29 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని జగన్ విమర్శించారు.

రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా వీరి తీరు ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయమంటే ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం, ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయడం, వ్యవసాయ రూపురేఖల్ని మార్చడం, లంచాలకు తావు లేకుండా, వివక్షలేకుండా ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేలా చేయడమేనని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయమంటే ప్రజలకు సేవ చేయడమే గాని చంద్రబాబు నాయుడు లాగా ప్రజలపై అజమాయిషీ చెలాయించడం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

First Published:  30 Dec 2022 2:56 PM IST
Next Story